ఆలయానికి కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం…
ఆలయానికి కొత్త రథం తీసుకొస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నారాయణపేట జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..దామగిద్ద మండలంలోని బాపన్‌పల్లి గ్రామానికి 4 కి.మీ. దూరంలో వెంకటేశ్వర గుట్టపై పురాతన దేవాలయం ఉంది. భక్తులు ఈ ఏడాది రథోత్సవం కోసం కొత్త ఇనుప రథాన్ని చేయించారు. శుక్రవారం రథసప్తమి కావడంతో రథాన్ని గుడి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్‌వైర్లు రథం పైభాగానికి తగిలాయి. దీంతో 18 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిడ్డిమూతుల హన్మంతు (34), సంజనోళ్ల చంద్రప్ప(37) మృతి చెందారు. కృష్ణాపురం వెంకటప్ప అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.