మోసగించిన కేసులో శ్రుతి అరెస్ట్
నకిలీ మహిళా ఐపీఎస్ అధికారి శ్రుతి సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో ఓ వ్యక్తిని మోసగించిన కేసులో ఆమె కటకటాలపాలైంది. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
తాను యువ ఐపీఎస్ అధికారినిగా చెప్పుకుంటూ శ్రుతి సిన్హా ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకి వీరారెడ్డి అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.
వీరారెడ్డి సోదరుడికి తన చెల్లితో పెళ్లి చేయిస్తానని నమ్మించింది. ఈ మేరకు తన బంధువు విజయ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆమె భారీ స్కెచ్ వేసింది. వీరారెడ్డి నుంచి ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను సొంతం చేసుకుంది. వీటి విలువ అక్షరాలా రూ.11 కోట్లు అని తేలింది.
నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో విజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్‌కుమార్ చావు శ్రుతికి చిక్కులు తెచ్చింది. శ్రుతి తనను మోసం చేసిందని వీరారెడ్డి గుర్తించాడు. దీంతో బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రుతిసిన్హాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారణ చేపట్టారు. దీంతో శ్రుతి మోసాలు బయటపడ్డాయి.
నిందితురాలి నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రుతి చేతిలో మోసపోయిన వారి జాబితా ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు జరిపితే శ్రుతి చేసిన భారీ మోసాలు వెలుగు చూడొచ్చని సమాచారం.