వృద్ధులకు టీకా దరఖాస్తు ప్రారంభం
దేశంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఇప్పుడు కోవిడ్ టీకా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ చేస్తున్న సెంటర్ల వద్దకు వెళ్లి దరఖాస్తు చేయవచ్చని లేదా ఆరోగ్య సేతు వంటి యాప్‌ల ద్వారా కోవిన్ 2.0 పోర్టల్ యాక్సెస్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వ్యాక్సినేషన్ సమాచారాన్ని లైవ్‌లో అప్‌డేట్ చేసే కోవిన్ ప్లాట్‌ఫామ్ అప్‌డేట్ కారణంగా శని, ఆదివారాల్లో (27, 28న) వ్యాక్సినేషన్ సెషన్లు ఉండబోవని, సోమవారం నుంచి వ్యాక్సినేషన్, రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయని తెలిపింది.అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద ఉచితంగానే టీకా ఇస్తారని, కానీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని భావిస్తే ముందుగా నిర్ణయించిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మరో 16,577 మందికి కరోనా..
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో 16 వేలకుపైగా కోవిడ్–19 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 16,577 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా, 120 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 1,10,63,491కు, మృతుల సంఖ్య 1,56,825కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మార్చి 31 వరకూ కోవిడ్ మార్గదర్శకాలు..
ఈ ఏడాది మార్చి 31 వరకూ కోవిడ్ మార్గదర్శకాలు అమల్లోనే ఉంటాయని కేంద్ర హోంశాఖ శుక్రవారం స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలంటూ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగాలకు సూచించింది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాంతర ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేసింది.