మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు
ఆన్లైన్ క్లాసులను ఆసరాగా చేసుకుని… సోషల్‌మీడియా ద్వారా మైనర్లకు ఎర వేస్తూ.. అందినకాడికి దండుకోవడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ హయత్‌నగర్ పోలీసులకు చిక్కిన బచ్చనబోయిన సాయికుమార్ అలి యాస్ సాయి వర్ధన్ యాదవ్ కేసులో మరికొందరూ నిందితులుగా ఉండి ఉంటారని పోలీసులు అను మానిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. బాధితులు అంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సాయిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
► సాయి ప్రధానంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, షేర్‌చాట్ వంటి యాప్స్‌ను వినియోగించాడు. ఆకర్షణీయమైన ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఇటీవల దాదాపు అన్ని పాఠశాలలు ఆన్లైన్ విధానంలో విద్యను బోధిస్తుండటంతో ఇతడికి కలిసి వచ్చింది.
► ప్రధానంగా మైనర్లను టార్గెట్‌గా చేసుకున్న సాయి తొలుత వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆపై హాయ్ అంటూ పలకరింపు సందేశాలు పంపించేవాడు. వీటిని స్పందించిన వారితో పరిచయం పెంచుకుంటూ సెంటిమెంట్‌తో కూడిన తియ్యటి మాటలు చెప్తూ ముందుకు వెళ్లి ఆపై అసలు కథ మొదలెట్టేవాడు.
► ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు చదవుతున్న వారితోనూ ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తీసుకువచ్చేవాడు. వారిని పూర్తిగా తన ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి ‘నీవు కాదంటే చచ్చిపోతా’, ‘నీవు లేకపోతే బతకలేను’ అంటూ చాటింగ్స్ చేసేవాడు. కొందరు బాలికలకు సాయి అసభ్యకర సందేశాలు పంపి వేధించినట్లు అనుమానాలున్నాయి.
► ఇతడి చేష్టలకు భయపడకుండా ఎవరైనా ఎదిరు తిరిగితే ఇక వారి జోలికి వెళ్లేవాడు కాదు. అలా కాకుండా తన వల్లోపడిన వారిని ఏకాంతంగా గడిపే వరకు తీసుకువెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు, సెక్స్ చాటింగ్స్‌తో బెదిరింపులకు దిగేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి దండుకునే వాడు.
► ఇతడి వల్లోపడిన వారిలో అనేక మంది బాలికలు తమ ఇళ్లల్లోనే చోరీలు సైతం చేశారని పోలీసులు చెప్తున్నారు. కొందరు నగదు, మరికొందరు బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి సాయికి అప్పగించారు. ఇతడి వ్యవహారం గుట్టురట్టయింది కూడా ఓ బాలిక చేసిన ఇలాంటి చోరీ తోనే కావడం గమనార్హం.
► ఈ వ్యవహారంలో సాయితో మరికొందరు జట్టు కట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
► సాయి ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా బాధితులను, అతడికి సహకరించిన వారికి పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముఠాలో కనీసం ఐదారుగురు ఉండి ఉంటారని, వారంతా సాయి స్నేహితులు లేదా క్లాస్మేట్స్ అని భావిస్తున్నారు.
► ఆన్లైన్ యాక్టివిటీస్ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులూ తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని పోలీసులు కోరుతున్నారు.