వడ్లు గురించి సంపూర్ణ వివరణ
వడ్లను సంస్కృతం నందు “శాలి ధాన్యం” అని పేరుతో పిలుస్తారు . సాధారణముగా హేమంత ఋతువులో పైరగుట వలన “హైమంతిక ధాన్యం ” అని కూడా పిలుస్తారు . సంస్కృత నిఘంటుకార్తలు వడ్లను రెండు తెగలుగా విడదీసి శాలిధాన్యం అని వ్రీహీ ధాన్యం అని పిలుయుచున్నారు. వ్రీహి ధాన్యం అనునది వర్షాకాలం నందు పండును. శాలిధాన్యం అనునవి హేమంత ఋతువు నందు పండును అని సంస్కృత నిఘంటుకర్తల అభిప్రాయం .
వ్రీహిధాన్యము నందు కృష్ణ వ్రీహి ధాన్యము ( నల్ల వడ్లు ) , పాటల వ్రీహి ధాన్యము , కుక్కు తాండకములు , శాలాముఖములు , జంతుముఖములు అని రకాలు కలవు . వ్రీహి ధాన్యము పాకము నందు తియ్యగా ఉండటం , చలవనిచ్చుట , కొద్దిపాటి మలబద్దకం కలగచేయుట , వ్రీహి ధాన్యము అన్నింటిలో కృష్ణ వ్రీహి ధాన్యము మిక్కిలి శ్రేష్టమైనది . ఈ ధాన్యము యొక్క అన్నము తియ్యగా , తెల్లగా ఉండును. కొంచం వగరు కలిగి పిత్తాన్ని హరించును . వీర్యవృద్ధిని ఇస్తూ , క్రిమిరోగములు , కఫవ్యాధులు , రక్తపిత్త వ్యాధులు , తాపదాహములు మొదలగువాటిని పోగొట్టి బుద్ది సూక్ష్మత కలిగించును . కొంచం వాతమును కూడా కలిగించును. ఈ వ్రీహిధాన్యములో షష్ఠికములు ( ఆరు నెలలకు పండునవి ) , మహా వ్రీహి ధాన్యము ( పెద్ద వడ్లు ), యవక ధాన్యము , పాక వ్రీహి ధాన్యము , రక్తసార ముఖములు ( ఎర్ర మొల కోలుకులు ) మొదలగు రకాలు కూడా కలవు .
శాలి ధాన్యము నందు రక్తశాలి , మహాశాలి , సుగంధప్రసవ , బృందారక , ముష్టక , శావరశాలి మొదలైన రకాలు కలవు . అన్నము రుచికరంగా , స్నిగ్దముగా ( చమురు కలిగి ) , బలమును , వీర్యమును , లఘుత్వమును ఇచ్చునదై , చలువనిచ్చునదై ఉండును.
అంతకు ముందు పోస్టు నందు వడ్ల గురించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది . ఇప్పుడు వడ్ల లోని రకాలు వాటిలోని ఔషధగుణాలు గురించి సంపూర్ణముగా వివరిస్తాను. వడ్లలో చాలా రకాలు ఉన్నవి. వాటిలో అతి ముఖ్యమైనవి అయిన 25 రకాల గురించి మీకు వివరిస్తాను .
1 . అక్కుళ్ళు –
ఇవి మేహశాంతి కలిగించును. అన్నం మీద ఇష్టాన్ని కలిగించును. రుచిని కలిగించును . తేలికగా ఉండును. త్వరగా జీర్ణం అగును. అతిగా తీసుకొనుచున్న మేహమును కలిగించును . పిత్తప్రకోపమును కలిగించును. కడుపునొప్పి కలిగించును. దీనికి విరుగుడు ఆవు మజ్జిగ , వాము , శొంఠి , మిరియాల కషాయం వాడవలెను .
2 . అటుగ డాలు –
ఈ ధాన్యము యొక్క అన్నం మిక్కిలి జీర్ణకారి . వేడి , మేహ , పైత్యరోగములును పుట్టించును . రుచికరంగా ఉండును. అతిగా వాడిన కొంత మందికి కడుపునొప్పి కలిగించును. దీనికి విరుగుడు వాము , శొంఠి , మిరియాల కషాయం . ఆవాల పిండి , ఆవు మజ్జిగ వీటిలో ఏదైనను వాడవచ్చు .
3 . ఇప్పపువ్వు రాజనాలు –
వీటి అన్నం శరీరాంగముల యందు కలుగు తాపమును తగ్గించును . మేహరోగములు , విషదోషములు , విసర్పి హరించి మలమూత్రబద్ధమును పోగొట్టును . బలకరమైనది . వీటికి విరుగుడు అటు గడాలు కు ఉపయోగించేవి పనిచేయును .
4 . ఈశ్వర పతులు –
వీటిని కొందరు కాకిరెక్కలు అని పిలుస్తారు . మరికొందరు కాకిముక్కులు అని పిలుస్తారు . ఇవి సన్నగా ఉండును. వీటి అన్నం రుచిగా ఉండును. శరీరానికి బలవీర్యములును ఇచ్చును. జఠరాగ్ని వృద్దిపొందించును. కఫాన్ని , వాతాన్ని హరించును . ధాతుపుష్టికరము . శరీరము నందు తేలికను , కాంతిని కలిగించును.
5 . ఏరడాపు వడ్లు –
ఇవి కొంచం నలుపు రంగుతో ఉండును. వీని అన్నం ఎరుపుగా ఉండి వాతపిత్తశ్లేష్మములు అనెడి త్రిదోషములను హరించును . పాండురోగము , మేహ వ్యాధులు , జ్వరములు పోగొట్టును . మలమూత్రబద్ధము , గురుత్వము , మత్తు కలిగించును. బలవీర్యకరము . దీనికి విరుగుళ్లు వాము , శొంఠి , మిరియాల కషాయం . ఆవాల పిండి , ఆవుమజ్జిగ . వీటిలో ఏదైనను వాడవచ్చు .