యుద్ధప్రాతిపదికన..కోవిడ్ -19 వ్యాక్సినేషన్..
చంద్రగిరి నియోజకవర్గంలో
* యుద్ధప్రాతిపదికన..
* కోవిడ్ -19 వ్యాక్సినేషన్
* ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యం
* అపోహలు వీడేలా అవగాహన కల్పించాలి
* వందశాతం వ్యాక్సినేషన్ కు శ్రీకారం
* కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన జర్నలిస్టులకు వ్యాక్సిన్
* ప్రభుత్వ విప్, తుడ చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతి,
చంద్రగిరి నియోజకవర్గంలో యుద్ధ ప్రాతపదికన 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కోవిడ్ -19 వ్యాక్సినేషన్ చేసుకోవాలని ప్రభుత్వ విప్, తుడ ఛైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల చివరి నాటికి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. గురువారం తిరుపతి రూరల్ మండలం ఎంపిడిఓ కార్యాలయంలో కోవిడ్ – 19 టీకా ప్రణాళిక పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియా తో మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గంలో 11 వేల మందికి వ్యాక్సిన్ వేయించడం జరిగిందన్నారు. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రజలు వ్యక్తిగతంగా ఇమ్యూనిటి పెంచుకొనే దిశగా నిత్యావసరాలు, పండ్లు, ఎనర్జి డ్రింక్స్, హోమియో టాబ్లెట్ లు, కోడిగుడ్లతో పాటు మాస్కులు, సానిటైజర్లను వ్యక్తిగత నిధులతో ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడి అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కరోనా మహమ్మారి చాపకింద నీరులా మళ్లీ విజృంభిస్తోందని, ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు సంకల్పించామని తెలిపారు. ఇందుకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. ప్రతి అధికారి కూడా పల్లెలో సందర్శించి వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆశ వర్కర్లు, హెల్త్ వర్కర్లను భాగస్వాములను చేయాలన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నిబంధన మేరకు 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ చేయించుకోవాలి వివరించారు. వచ్చే నెల 10వ తేదీ నాటికి వంద శాతం వ్యాక్సిన్ వేయించాలని అధికారులను కోరారు. కేంద్రం ఆమోదించిన వ్యాక్సిన్ ల పట్ల అపోహలు వీడాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులకు టీకా..
* వయస్సుతో నిమిత్తం లేకుండా..
కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు ఎంతో కష్టపడ్డారు. మీ కష్టం నాకు తెలుసు.. వయస్సు తో సంబధం లేకుండా జర్నలిస్టులు వ్యాక్సిన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ మంగళవారం సకల సదుపాయాలతో తిరుపతి రూరల్ మండలం ఎంపిడిఓ కార్యాలయంలో ప్రత్యేకంగా జర్నలిస్టులకు వ్యాక్సిన్ చేయించే ప్రక్రియ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముందు జర్నలిస్టులు వేసుకంటే ప్రజలకు కూడా బలమైన నమ్మకం ఏర్పడుతుందని సూచించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను చెవిరెడ్డి సూచించారు. అనంతరం నియోజకవర్గ అధికారులతో టీకా ప్రణాళికపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.