తెలంగాణలో మళ్లీ ఆంక్షలు…


కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్‌–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్‌ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థన స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్‌ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశంలో మళ్లీ కోవిడ్‌–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది.

About The Author