పసిగుడ్డుతో అత్తింటికి వచ్చిన రోజే..


రెండో కాన్పు తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి చంటిపాపతో వచ్చిన ఓ బాలింత అదేరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హుజూరాబాద్‌ మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. రాంపూర్‌కు చెందిన గోశికొండ ధనుంజయ్‌కు మానకొండూరు మండలం చెంజర్లకు చెందిన వాసాల సత్యనారాయణ–రమ దంపతుల రెండో కుమార్తె మౌనికతో 2018 ఆగస్టులో వివాహం జరిగింది.
ధనుంజయ్‌ హుజూరాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. వివాహం జరిగిన తొలిరోజు నుంచే అతను మౌనికను అనుమానించడం మొదలు పెట్టాడు. దీనికితోడు అత్త తార వేధింపులకు గురిచేసేది. రెండు, మూడుసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా వారిలో మార్పు రాకపోగా మౌనికపై వేధింపులు ఎక్కువయ్యాయి. ధనుంజయ్‌–మౌనిక దంపతుల కు ఒక బాబు ఉన్నాడు. మౌనిక ఆరు నెలల కిందట రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శనివారమే ఆ పసిగుడ్డుతో అత్తింటికి వచ్చింది. ఏమైందో తెలియదుగానీ విగతజీవిగా మారింది.
ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని కేకలు..
తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ ధనుంజయ్‌ శనివారం సాయంత్రం కేకలు వేశాడు. దీంతో చుటుపక్కల వాళ్లు అతని ఇంటికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుజూరాబాద్‌ టౌన్‌ సీఐ మాధవి ఘటనాస్థలికి చేరుకున్నారు. మౌనిక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె భర్త ధనుంజయ్‌ని విచారించారు. తల్లి మృతదేహం వద్ద చిన్నారులు వెక్కివెక్కి ఏడవడం స్థానికులను కంటతడి పెట్టించింది.
భర్త, అత్తపై కేసు..
తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త ధనుంజయే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు రమ–సత్యనారాయణ ఆరోపించారు. మౌనిక తల్లి ఫిర్యాదు మేరకు తార, ధనుంజయ్‌లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మాధవి తెలిపారు.
చిన్నారిని అక్కున చేర్చుకున్న సీఐ..
మౌనిక మృతదేహం వద్ద ఆమె ఇద్దరు చిన్నారులు వెక్కివెక్కి ఏడుస్తుండటంతో సీఐ మాధవి చలించిపోయారు. పాపను అక్కున చేర్చుకొని, ఏడుపు ఆపే వరకు ఎత్తుకొని ఆడించారు.

About The Author