లక్ష అడుగుల కేసీఆర్‌ చిత్రం..


హాలియాలో నేలపై ముఖ్యమంత్రి అద్భుత చిత్రపటం, రైతుల వెన్నంటే సీఎం కేసీఆర్‌ ఉన్నారని సందేశం, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం రికార్డు
తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగచేసి, రైతును రాజుగా మార్చిన సీఎం కేసీఆర్‌పై అభిమానాన్ని అనేకమంది అనేకరకాలుగా వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతుల బతుకుకు భరోసాఇచ్చిన కేసీఆర్‌పై టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా విభాగం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైతు వెన్నంటే కేసీఆర్‌ ఉన్నారన్న అర్థంవచ్చేలా భూమిపై నాగళ్లతోనే ఓ భారీ చిత్రాన్ని చిత్రించింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హాలియా మున్సిపాలిటీ పరిధిలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిపై కేసీఆర్‌ చిత్రాన్ని, ఆ పక్కనే భుజం పై నాగలితో ఉన్న రైతు ఫొటోను గీశారు. ఇందుకోసం స్థానిక రైతుల సహకారంతో టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం ట్రాక్టర్‌, ప్లవ్‌, కల్టీవేటర్‌ను ఉపయోగించింది.
ఈ చిత్రాలను వేయటానికి రెండురోజులు పట్టింది. చిత్రాలు గీసిన తర్వాత డ్రోన్‌ కెమెరాతో వాటిని చిత్రించి టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా కన్వీనర్‌ పాటిమీది జగన్మోహన్‌రావు సోమవారం సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. చిత్రాల పక్కనే టీఆర్‌ఎస్‌ వెంటే నాగార్జునసాగర్‌ అని ఇంగ్లిష్‌లో రాశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగర్‌ నియోజకవర్గంలో 60 వేల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నీరందుతున్నదని, కుంకుడు చెట్టు తండా ప్రాజెక్టు, నెల్లికల్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టులు పూర్తయితే మరో 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని జగన్మోహన్‌రావు తెలిపారు.

About The Author