కారోనాకు టాబ్లెట్ వచ్చేస్తుంది…ఒక్కరోజులోనే కారోన మాయం…
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. వ్యాక్సిన్ రానే వచ్చింది.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగానే సాగుతుంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్ధిక చేయూతనిస్తున్న కేంద్రం కొత్త వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
అయితే వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా బారిన పడుతుండడంతో ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అసలు వైరస్ ను చంపే మందే లేదా అని మళ్ళీ ఎదురుచూపులే కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో అమెరికాలోని జార్జియా స్టేట్యూనివర్శిటీ పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. అదేమంటే కరోనాను చంపే టాబ్లెట్ తయారుచేస్తున్నామని.. ఇది ఒక్కరోజులోనే వైరస్ ను చంపేస్తుందని ప్రకటించారు. వీళ్ళు తయారుచేసిన మోల్నుపిరావిర్ (Molnupiravir) అనే యాంటీ వైరల్ టాబ్లెట్ కరోనా సోకిన దేహానికి ఇస్తే అది ఒక్కరోజులోనే దేహంలోని వైరస్ ను చంపేస్తుందట. ఇప్పటి వరకు కరోనాను ఎదుర్కొనే టాబ్లెట్ లేకపోగా ఇదే మొట్టమొదటి టాబ్లెట్.
నిజానికి దీన్ని కరోనా కోసం తయారుచేయలేదు. మెర్స్, సార్స్ లాంటి వేరే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లను చంపేందుకు తయారుచేశారు. ఐతే… ఇది కరోనాతోపాటూ ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్‌లను బాగా చంపుతోందని పరిశోధనల్లో తేలిందట. ఇప్పటికే ఫెర్రెట్ అనే జంతువుల మీద ప్రయోగాలు జరపగా ఇది సక్సెస్ అయిందట. ఫెర్రెట్లలోకి వైరస్ పంపి ఈ టాబ్లెట్ ను ఇవ్వగా 24 గంటలలో వైరస్ నాశనం చేయడంతో పాటు ఆ ఫెర్రెట్ నుండి వైరస్ గాల్లోకి వ్యాప్తి కూడా చేయలేకపోతుందట. ఈ పరిశోధన వివరాల్ని నేచర్ మైక్రోబయాలజీ పేపర్‌లో ఏప్రిల్ 16న ప్రచురించారు.
నిజానికి ఈ టాబ్లెట్ తరహాలోనే ప్రస్తుతం రెమ్‌డెసివిర్ పనిచేస్తోంది. కాకపోతే రెమ్‌డెసివిర్‌ని కరోనా సోకిన తర్వాత అది ముదరకముందే ఇవ్వాలి. ముదిరిన తర్వాత ఇస్తే ప్రయోజనం కనిపించట్లేదు. కానీ మోల్నిపిరావిర్ టాబ్లెట్ మాత్రం వైరస్ ముదిరిన తర్వాత కూడా కేవలం ఒక్కరోజులోనే వైరస్ ను చంపేస్తుందట. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగాలు ఇంకా చివరి దశలో ఉండగా త్వరలోనే ఆ రిపోర్టులను డబుల్యుహెచ్ఓకి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదముద్ర పడితే ఈ టాబ్లెట్ అందుబాటులోకి రానుంది. మరి దీనికి ఎంతసమయం పడుతుందో చూడాల్సి ఉంది.