గుడ్‌ న్యూస్: భారత్‌కు అదనపు సహాయం.. దిగొచ్చిన అగ్రరాజ్యం


భారత్‌కు వైద్యానికి అవసరమయ్యే ముడిసరకు ఎగుమతి అంశంపై అగ్ర‌రాజ్యం అమెరికా ఎట్టకేలకు దిగొచ్చింది. క‌రోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావానికి అల్లాడిపోతున్న భారత్‌ను ఆదుకోవాలంటూ అన్ని వైపుల నుంచి వ‌చ్చిన ఒత్తిడికి బైడెన్‌ ప్రభుత్వం త‌లొగ్గింది. ఈ నేఫథ్యంలో ఇండియాకు కరోనాను ఎదుర్కోవడానికి వైద్య పరంగా అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని అందించ‌నున్న‌ట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్ల‌డించారు. ఈ విషయాన్ని బ్లింకన్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం: ఆంటోనీ బ్లింకెన్
ప్రస్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో భారత్‌కు సాయం చేయాలంటూ యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ ఇండియ‌న్‌-అమెరిక‌న్‌లు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని వాళ్లు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ భారత్‌కు సహాయం అందించే విషయంపై శుక్రవారం విలేకరుల సమావేశంలో సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో అగ్రరాజ్యం భారత్‌కు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. దీంతో బ్లింకన్‌ తన ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్ట్‌ చేశారు. ‘కొవిడ్ మ‌హ‌మ్మారితో స‌త‌మ‌వుతున్న భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం. భార‌త ప్ర‌భుత్వంలో ఉన్న మా భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందిస్తామని’ బ్లింకెన్ చెప్పారు.
ఒత్తిళ్లకు దిగొచ్చారు
అమెరికాలో క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో ఇండియా ముందుకు వ‌చ్చి సాయం చేసినా.. ఇప్పుడు అగ్ర‌రాజ్యం మాత్రం ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంపై బైడెన్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. అమెరికా స్టోరేజ్‌లో ఉన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న భారత్‌కు ఇవ్వాల‌ని యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు కాంగ్రెస్ స‌భ్యులు కూడా బైడెన్ ప్ర‌భుత్వాన్ని కోరారు. అయితే ఇటీవల భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించిందన సంగతి తెలిసిందే. దీనిని సమర్థించుకుంటూ అమెరికా వర్గాలు తమకు అమెరికా ప్రజల బాధ్యతలను పట్టించుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించకున్నారు. ప్రస్తుత ఒత్తిళ్లకు అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంది.

About The Author