ధర్మా సందేహం…సంక్రాంతి పండుగ విశిష్టత….

సంక్రాంతి_పండుగ_విశిష్టత

సంక్రాంతి అంటే మార్పు.సంక్రాంతి అంటే మారడం,చేరడం అనే అర్ధాలు ఉన్నాయి.రవి సంక్రమణం రోజున స్నానం చేయ్యని నరుడు ఏడు జన్మలదాకా రోగి,నిర్ధనుడు అవుతాడు.కనుక సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి ,పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి.కొందరు నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేస్తారు.శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది.ఈ సంక్రమణకాలంలో ధాన్యం,ఫలాలు,విసనకర్ర , వస్త్రం, గుమ్మడి, సువర్ణం, కాయగూరలు, దుంపలు,తిలలు,చెఱకు,గోవు మొదలైనవి దానం చేయాలి.ఈ రోజున వస్త్రదానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం అనే పంచ ఋణాల నుంచి విముక్తిని పొందే మార్గాలను ప్రతి గృహస్థుడు ఏ విధంగా ఆచరించాలో ఒక ఆచారాన్ని నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.

#దేవఋణం
ఇంద్ర,వరుణ,వాయు దేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించుట వల్లనే మకర సంక్రాంతి పండగ నాటికి పంటలు సమృద్ధిగా పండి,రైతు చేతికి అందుతాయి.తద్వారా మనిషి జీవన పోషణ జరుగుతుంది.అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి,సూర్యాది దేవతలను పూజించి,కొత్త బియ్యంతో పొంగలి,పులగం తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదించడం మన ఆచారం.

#పితృఋణం
పితృ తర్పణాలు ,పిండోదక దానాలు,శ్రాద్ధకర్మలు మొదలగునవి ఆచరించడం ద్వారా , మరణించిన పితృల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు.మకర సంక్రాంతినాడు తెలక పిండి(నువ్వులపిండి) ఒంటికి రాసుకుని స్నానం చేయడం ఒక ఆచారం.ఎందుకంటే మకర రాశికి శని అధిపతి.శని వాత ప్రథాన గ్రహమంటారు.వాతం తగ్గాలంటే ఈరోజు తెలకపిండితో స్నానం చేసి,నువ్వులు,బెల్లం,గుమ్మడికాయ మొదలైనవి దానాలు ఇవ్వడమే దీనికి పరిహారం.కాబట్టే నువ్వులు, బియ్యంపిండి, బెల్లంతో చేసిన అరిసెలను అంతా కూడా తింటుంటారు.

#భూతఋణం
నీరు,భూమి,గాలి,ఆకాశం,అగ్ని వంటి పంచభూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి.అందుకే కృతజ్ఞతతో పంచభూతాలను కూడా పూజిస్తాం.పండిన పొలాల్లో పొంగలి మెతుకులు ,పసుపుకుంకాలు చల్లి ఎర్ర గుమ్మడి కాయను పగులకొట్టి దిష్ఠి తీయడం ఆచారమైంది.పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి.ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి.కాబట్టే కృతజ్ఞాతాసూచకంగా ‘కనుమ’ నాడు పశువులను, పశుశాలను శుభ్రం చేసి అలంకరిస్తారు.వాటికి కూడా పొంగళ్ళు తినిపిస్తారు.ఇళ్ళ ముంగిట బియ్యం పిండితో రంగవల్లులు వేస్తారు.ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహరం.ఇలా మూగ జీవులకు ,భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాన్ని ఈ పండుగ నిర్దేశించింది.

#మనుష్యఋణం
ఇతరుల సహాయసహకారాలు లేనిదే సమాజంలో జీవనం సాగించలేం.అందుకు కృతజ్ఞతగా ఈ పండుగనాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరుకు, గోవులు, ఫలాలు, వస్త్రాలు, బంగారం వంటివి విరివిగా దానధర్మాలు చేస్తారు.అతిథులను ఆదరిస్తారు.వ్యవసాయంలో సహాయం చేసినవారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ
కొత్త ధాన్యాన్ని పంచి పెట్టడం కూడా సంక్రాంతిలో మరొక ఆచారం.

#ఋషిఋణం
సంక్రాంతి సాధనలు, సత్ గ్రంధ పఠనాదులూ శిఘ్రఫలాలనిస్తాయని విశ్వసిస్తారు.వీటిని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుందని భావిస్తారు..

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. [బుడబుక్కలవాళ్లు], పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే – ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు..

#ఉత్తరాయణం
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.

“సంక్రాంతి” లేదా “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో “సంక్రాంతి”ని ఇలా విర్వచించారు – తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః – మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి – సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది..

#దానాదులు.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.

#భోగి_మంటలు
ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

#సంక్రాంతి
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

#కనుమ
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు.

కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. మాంసా హారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం..

#పండుగ_ప్రత్యేకతలు
నువ్వులు మరియు బెల్లం ప్రధానంగా చేసిన నువ్వుల బర్ఫీ
ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌),చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలుకూ సంకేతాలుగా చెప్పచ్చు.

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

#గొబ్బెమ్మలు
పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది..

మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.

#భోగిపళ్ళు
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

#తిల_తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

#సంకురుమయ / #సంక్రాంతి_పురుషుడు
మట్టితో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం), మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

#హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం..

#గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మబద్దమైనదని అర్ధం. “జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.

#గాలిపటాలు
సంక్రంతి పండుగ పిల్లలందరికి చాలా ప్రథ్యెకమైన పందుగ, అది ఎంధు వలననగ పిల్లలు అరజు పొద్దిన నుది సాయంత్రం దాకా గాలిపటాలతొనె గడుపుతారు..

#ఆత్మబంధువులందరికీ_సంక్రాంతి_శుభాకాంక్షలు

” మరళా ఇదే శుభ సమయంలో మరొక్క ధర్మా సందేహంలో కలుసుకుందాం నేస్తాలు ” సెలవు …

ॐ ప్రియమైన మిత్రులందరికీ శుభోదయం ॐ

*ॐ మీ మిత్రుడు.

About The Author