ఉచితంగా ఇన్సూరెన్స్‌ అంటూ ఎర…


ఉచితంగా ఇన్సూరెన్స్‌ వస్తుందని నమ్మి సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కిన వ్యక్తి రూ.98 వేలు పోగొట్టుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం… చింతల్‌ ప్రసూన నగర్‌కు చెందిన గుళ్లపల్లి కిషోర్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. ఇతను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నాడు. గత నెల 29న కిషోర్‌ ఫోన్‌కు వరినీక అనే పేరుతో ఓ అమ్మాయి ఫోన్‌ చేసి తాను స్టాండర్డ్‌ చార్టెడ్‌ క్రెడిట్‌ కార్డు కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది.అనంతరం మీ క్రెడిట్‌ కార్డుతో ఫ్రీగా ఇన్సూరెన్స్‌ వస్తుందని చెప్పి అతడి వివరాలు అడిగింది. దీంతో కిషోర్‌ తన పేరు, కార్డ్‌ నంబర్, పుట్టిన తేదీ, కార్డు వ్యాలిడిటీ అన్నీ చెప్పాడు. అనంతరం మీ కార్డుకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి అని అడగ్గా కిషోర్‌ ఆమెను గుడ్డిగా నమ్మి చెప్పేశాడు. వెంటనే అతడి క్రెడిట్‌ కార్డు నుంచి రూ.98 వేలు వాడుకున్నట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ఈ విషయాన్ని సదరు అమ్మాయికి తెలపగా మళ్లీ ఇంకో ఓటీపీ వస్తుందని, అది చెప్తే రూ.98 వేలు తిరిగి మీ అకౌంట్‌కు వస్తాయని చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిషోర్‌ ఫోన్‌ కట్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author