బిడ్డకు కొత్త బట్టలు కొనాలని వెళ్లాడు.. అంతలోనే


కుమారుడు చైతన్య పుట్టిన రోజున కొత్త బట్టలు కొనేందుకు.. ఫొటోల వ్యాపారం చేసి డబ్బు తెస్తానని చెప్పి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా డని తిరుమల అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన తుమ్మల మల్లిరెడ్డి(45) భార్య శోభ కన్నీరుమున్నీరయ్యారు. తిరుచానూరుకు చెందిన మల్లిరెడ్డి ఇక లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాథాలు మిన్నంటాయి. ఆమె మాట్లాడుతూ.. ‘‘నా భర్త సోమవారం రాత్రి తిరుమలకు వెళ్లాడు. బయలుదేరే మందు బాబు పుట్టినరోజుకు బట్టలు కొనడానికి డబ్బులు లేవన్నాడు.

వ్యాపారం చేసి.. వచ్చిన డబ్బుతో బాబు పుట్టినరోజు ఘనంగా చేద్దామన్నాడు. కొండ మీద జనం లేరు కదా..? ఎందుకులే అని చెప్పినా వినలేదు. తిరుమలకు ప్రయాణమయ్యాడు. తిరిగి రాత్రి 9.30 గంటలకు ఫోన్‌ చేశాడు. ఇక మంగళవారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. పక్క షాప్‌ అతనికి ఫోన్‌ చేసి..ఒక్కసారి చూడన్నా అని∙అడిగాను.. ఆ తర్వాత కొద్దిసేపటికే మా ఆయన అగ్నికి ఆహుతయ్యాడని తెలిసింది’’ అంటూ రోదించారు.

ఇలాంటి ఘటన బాధాకరం: భూమన
తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 20 దుకాణాలు పైగా కాలిపోవడం, అందులో 12 షాపులు పూర్తిగా దగ్ధం కావడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిరుచానూరుకు చెంది న మల్లిరెడ్డి మంటల్లో ఆహుతైపోవడం కలిచి వేసిందన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామన్నారు. దగ్ధమైన షాపుల నిర్వాహకులు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని.. టీటీడీ చైర్మన్‌తో సంప్రదించి వీరికి పరిహారం ఇచ్చే విధంగా చూస్తామన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథ మికంగా నిర్ధారించామన్నారు. కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నముని ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

About The Author