అంబులెన్స్ లపై జి.ఎస్.టి రేట్లు తగ్గించాలని ప్రధాన మంత్రికి ఎం.పి.బాలశౌరి లేఖ


ప్రస్తుతం దేశమంతా ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం వారు మెడికల్ ఆక్సిజన్ లపై, వ్యక్తిగతం గా ఉపయోగిస్తున్న oxygen concentrators విషయంలో GST తగ్గించడం ముదావహం. కరోన బాధితులకి ఆక్సిజన్ సరఫరా ఎంతో కీలకంగా మారిన ప్రస్తుత తరుణంలో ఇటువంటి చర్యలు ప్రజలకు ఊరట కలిగిస్తాయి. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన ప్రాథమిక భాద్యత ప్రభుత్వాలపై ఉందన్న సత్యం మరువరాదు. ఇటువంటి సమయంలో మెడికల్ ఆక్సిజన్ పై ఇప్పుడున్న 12 శాతం GST ను కూడా పూర్తిగా తొలగించినట్లయితే, కరోనా బారిన పడి ఆక్సిజన్ కోసం అలమటిస్తున్న పేదలకు ఎంతో మేలు చేసినవారవుతారు.
అలాగే ప్రస్తుతం తగ్గించిన 12 శాతం GST కూడా కేవలం 30.06.2021 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. శాస్త్రవేత్తలు మరియు వైద్య రంగ నిపుణులు కరోనా అంత త్వరగా సమసిపోదని, ఇంకా థర్డ్ వేవ్ కూడా ఉంటుందని, దానికి కూడా ప్రజలు సిద్ధం కావాలని చెబుతున్న ఈపరిస్థితులలో మెడికల్ ఆక్సిజన్ పై సబ్సిడీని ప్రజలు ఈ ఉపద్రవం నుండి బయట పడేవరకు ఎటువంటి కాల పరిమితి లేకుండా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ కరోనా కష్టకాలంలో అంబులెన్సుల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వాటి యొక్క పరిమాణం, అందులో ఉండే అధునాతన వైద్య పరికరాలు తదితరాలను లెక్క లోకి తీసుకుంటే, ఒక్కొక్క అంబులెన్సు ఖరీదు సుమారుగా 7 నుండి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజల ప్రాణాలను కాపాడే అంబులెన్సులపై 28 శాతం జి.ఎస్.టి అమలు చేస్తున్నారన్న విషయం తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యాను. దయచేసి అంబులెన్సులపై జి.ఎస్.టి 28 శాతం పూర్తిగా తొలగించినట్లయితే పేదలకు మేలు చేసిన వారవుతారు..
అంతేకాకుండా 3 నెలల కొకసారి జరిగే జి.ఎస్.టి. కౌన్సిల్ మీటింగ్ ను గత 6 నెలలుగా జరపనందున, వెంటనే ఏర్పాటు చేయాలనీ , సదరు సమావేశంలో జి.ఎస్.టి. స్లాబ్ ల విషయంలో తగు చర్చలు జరిపి మెడికల్ కు సంబందించిన వాటిపై పన్ను తగ్గించే అంశం పరిశీలించి, ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా, మేలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రధాన మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది.

ఎం.పి. కార్యాలయం,
మచిలీపట్టణం.

About The Author