ఏసీబీ వలలో.. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ అవినీతి అధికారులు


ఏసీబీ వలలో..
* ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ అవినీతి అధికారులు
* ఎన్ఓసి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షల లంచం డిమాండ్
* మొదటి విడతగా రూ.1.50 లక్ష తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
* సత్యవేడు లో చోటుచేసుకున్న సంఘటన

తిరుపతి,

ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ లో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. ఎన్ఓసి ఇచ్చేందుకు రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ కి పట్టుబడ్డారు. ఈ సంఘటన శనివారం సత్యవేడులోని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ కి పట్టుబడిన వారిలో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ డివిజినల్ మేనేజర్ పిచ్చయ్య, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దిలీప్ ఉన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ అల్లాభక్ష్, జనార్ధన్ నాయుడు పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే..

ఆయుర్వేదం, మెడిసిన్ ఇతర అవసరాలకు వినియోగించే యూకలిప్టస్ చెట్లను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెట్ కార్పొరేషన్ నుంచి ఇ – టెండర్ నిర్వహించింది. 14 వేల టన్నులు చెట్లను కాంట్రాక్టర్ మస్తాన్ రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్ కింద టెండర్ మొత్తం లో 25 శాతం అంటే రూ.1.03 కోట్లు చెల్లించారు. అంతకు ముందు 10 శాతం డిపాజిట్ ను టెండర్ వేసేందుకు చెల్లించారు. చెట్లు కొనుగోలు, తరలింపు నిబంధనల మేరకు జరిగింది. ఆనక బ్యాంక్ లో చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1.03 కోట్లను విడుదల చేసేందుకు అవసరమైన ఎన్ఓసి తీసుకునేందుకు కాంట్రాక్టర్ అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో ఆ అధికారులు రూ.5 లక్షలు నగదు డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని కాంట్రాక్టర్ రూ.4.50 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మొదటి విడతగా రూ.1.50 లక్ష నగదు ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్సై లు సూర్యనారాయణ, విష్ణువర్ధన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About The Author