డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!
తాటిముంజలు , నీటిముంజలు, పాలముంజలు.. ఎలా పిలుచుకుంటేనేం, ఎండకాలం వచ్చిందంటే చాలు పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్లతెల్ల ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి, నోరూరిస్తాయి. తెలంగాణలో తాటికల్లు ఎంత ఘనమో, తాటిముంజలూ అంతే ప్రత్యేకం. తాటిముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ‘ఐస్ ఆపిల్స్’ అంటూ ఆపిల్ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు. పోషకాల్లో మేటి అయిన ముంజల ముచ్చట్లు..
తాటిముంజలు తినడం కూడా ఓ స్టైలే. పట్టణాలు, నగరాల్లో స్పూన్లు, ఫోర్కులతో తింటారు. కానీ, పల్లెల్లో అప్పటికప్పుడు తాటికాయ ఒలిచి బొటన వేలితో తీసుకుని తింటుంటే ఆ మజాయే వేరు. తాటిముంజల్ని ‘తాటికన్నులు’ అనీ అంటారు. మార్కెట్‌లో ముంజలకు గిరాకీ ఉండటంతో వ్యాపారులు ఏడాదంతా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంజల్ని బాగా శుభ్రపరచి నిల్వచేస్తారు.
కొబ్బరిని ఇష్టపడే వాళ్లంతా తాటిముంజల్నీ ఇష్టపడతారు. దీని రుచి లేత కొబ్బరి మాధుర్యాన్ని తలపిస్తుంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలకు ముంజలే మంచి ఔషధాలని అంటారు. అలసిన వేళ ముంజలు మహాశక్తినిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవిలో తాటి ముంజలకు జైకొడదాం.
తాటి చెట్టు తల్లి అయితే, తాటిముంజలు పిల్లలు. వేసవి అంటేనే మండే ఎండలు. భానుడి ప్రతాపం నుంచి బయట పడేందుకు రకరకాల దారులు వెతుకుతుంటారు. కడుపులో ‘చల్లచల్లగా ఏం వేద్దామా’ అని ఎదురు చూస్తుంటారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు ఓ చక్కటి పరిష్కారం తాటిముంజలు. వీటిలో నీటి శాతం పుష్కలం. నాలుగు ముంజలు గుటుక్కుమనిపిస్తే ‘డీహైడ్రేషన్’ సమస్యే ఉండదని నిపుణులు తేల్చారు. అదనంగా తక్షణ ఎనర్జీ!
పాల ముంజలతో వంటలుకూడా చేసుకోవచ్చు. ప్రాంతాలు, పద్ధతులనుబట్టి కొందరు వీటిలో సగ్గుబియ్యం, బెల్లం వేసి వండుతారు. చూసేందుకు అచ్చం పాయసంలా కనిపిస్తూ నోరూరిస్తుందీ వంటకం. పాయసం వండేసి, చివర్లో ముంజల్ని చిన్నచిన్న ముక్కల్లా తరిగి పైనుంచి వేస్తారు. వీటితో స్వీట్లు, జ్యూస్, లస్సీలు, సలాడ్‌తోపాటు చికెన్, మటన్ వంటలనూ వండేస్తున్నారు. మసాలా ఘాటుతో నోరూరిస్తున్నారు.
తాటి ముంజల వల్ల మేలు అంతా ఇంతా కాదు. మన దాహార్తిని తీర్చి, శరీరానికి చల్లదనాన్నిస్తాయి. ఎన్నో పోషకాలనూ అందిస్తాయి. తాటిముంజల్లో విటమిన్-బి, ఐరన్, క్యాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటిముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజల్ని కనుక తింటే, ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటారు.
తాటి ముంజలకు ఔషధగుణం ఉంది. లివర్ సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. వీటిలోని పొటాషియం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇవి మరింత మంచి ఆహారం.