‘గులాబీ’లో గుబులు!


తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)లో నిశ్శబ్దంతోపాటు ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ వ్యూహాలు కీలక నేతలకు సైతం అంతుచిక్కడంలేదు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అరెస్టు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అవినీతి, ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలపై కూడా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కీలక నేతలు సహా ఏ ఒక్కరూ నోరువిప్పడంలేదు.
దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికలతోనే అప్రమత్తం
గత ఏడాదిలో జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌ కుదుపునకు లోనైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా బీజేపీ దూకుడు పెంచడంతో సుమారు రెండు నెలలపాటు పరిస్థితులను మదింపు చేసిన కేసీఆర్‌ తన వ్యూహానికి పదును పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో వ్యూహం అమలుకు శ్రీకారం చుట్టారు.

ఫిబ్రవరి 7న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య ప్రజాప్రతినిదులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తాను సీఎంగా పదేళ్లు కొనసాగుతానని కుండబద్దలు కొట్టడంతోపాటు పార్టీ లైన్‌ దాటి మాట్లాడేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు షెడ్యూలును ప్రకటించారు.

ఎన్నికల అస్త్రంతో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట
దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ తర్వాత జరిగిన ఇతర ఎన్నికలను అస్త్రంగా ప్రయోగించారు. శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ‘నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌’స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు బీజేపీ సిట్టింగ్‌ స్థానం ‘హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’ను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. పట్టభద్రుల కోటా ఎన్నికల ఫలితాల్లో బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టిన కేసీఆర్‌ సాగర్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ దక్కకుండా చేయడం ద్వారా టీఆర్‌ఎస్‌ శిబిరంలో మునుపటి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. శాసనసభలో ఇదివరకే కాంగ్రెస్‌ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కాగా, గత నెలలో టీడీపీ లెజిస్లేచర్‌ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌లో విలీనమైంది.

About The Author