నవ్వుతో వలవిసిరింది .. దేశ రహస్యాలు సేకరించింది .. 50 మంది జవాన్ లకు పాకిస్తానీ అనికా టోకరా …
నవ్వుతో వలవిసిరింది .. దేశ రహస్యాలు సేకరించింది ..
50 మంది జవాన్ లకు పాకిస్తానీ అనికా టోకరా ..
ఓ అందమైన అమ్మాయి..అంతకంటే అందమైన నవ్వుతో జవాన్లను టార్గెట్ చేసింది. వయ్యారాలు పోతున్న ఫొటోలను ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ చేస్తూ సైనికులను వలలోకి లాగింది. అలా కపట నవ్వుతో ఒకరిద్దరిని కాదు ఏకంగా 50 మంది జవాన్లను మోసం చేసింది. వారి దగ్గర్నుంచి మిలిటరీకి సంబంధించిన సున్నితమైన రహస్యాలను రాబట్టుకోవాలని ప్రయత్నించింది. ఆ నవ్వు వెనక కాలకూట విషం దాగుందని తెలుసుకోలేపోయిన ఓ జవాను ఆమె అడిగిన సమాచారం ఇచ్చుకుంటూ వచ్చాడు. సంప్రదాయంగా చీరకట్టులో ఉన్న ఆమెను చూసి భారతీయ స్త్రీ అనుకున్న ఆయన..మిలిటరీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఆమెకు చేరవేశాడు. తీరా అరెస్టయ్యాక తెలిసింది ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్‌కి చెందిన ఏజెంట్ అని.
ఫేస్‌బుక్‌లో అనికా చోప్రా అని, తాను మిలిటరీ నర్సింగ్ కార్ప్స్‌కి కెప్టెన్ అని ప్రొఫైల్‌లో ఈ ఏజెంట్ రాసుకొచ్చింది. ఈనేపథ్యంలో సోమ్ వీర్ సింగ్‌కు 2016లో ఫేస్‌బుక్ వేదికగా పరిచయమైంది. తనకి ఆర్మీ అంటే ఇష్టమని, జవాన్లంటే గౌరవం అని చెప్పి అతడితో మాటలు కలిపింది. సోమ్‌వీర్‌తో చాలా సన్నిహితంగా మెలుగుతూ జవాన్లుండే స్థావరాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోసాగింది. అంతేకాకుండా భార్యకు విడాకులిచ్చి తనని పెళ్లాడాల్సిందిగా జవాను పై ఒత్తిడి తెచ్చింది. ఈ విషయంలో అతడిని బెదిరించింది కూడా. అయితే గత కొద్ది రోజులక్రితం సోమ్‌వీర్ ప్రవర్తనను గమనించిన సహజవాన్లు పై అధికారులకు సమాచారమిచ్చారు.
దీంతో సోమ్‌వీర్ ఫోన్‌కాల్స్, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. అనికా చోప్రా, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణను గురించి తెలుసుకున్నారు. భారత మిలిటరీకి సంబంధించి ఎంతో విలువైన సమాచారం, ఫొటోలు సోమ్‌వీర్ ఆమెకు పంపినట్లు గుర్తించారు. వెంటనే జవానును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరపగా ఈమె సోమ్‌వీర్‌నే కాకుండా వివిధ స్థావరాల్లో ఉన్న సుమారు 50 మంది జవాన్లకు వల విసిరిందని తేలింది. అంతేకాకుండా వీరితో చాట్ చేయడానికి ఒక్కొక్కరికీ ఒక్కో సమయం కేటాయించిందని మిలిటరీ అధికారులు తెలిపారు. సోమ్‌వీర్ మాత్రం తనకేం తెలీదని ఆమె వ్యక్తిగత వివరాలను తానెప్పుడూ అడగలేదని తెలిపాడు. అయితే దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.