అమల్లోకి లాక్‌డౌన్.. టీకా అయితే ఓకే
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించింది. ఉదయం 10గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి (మే 12 నుంచి 21 వరకు) పదిరోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుతుంది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. అత్యవసర సర్వీస్‌లకు మినహాయింపు ఉంది. టీకా కోసం వెళ్లేవారికి మినహాయింపు ఇచ్చారు.ఇక లాక్‌డౌన్ ఆంక్షలను కేవలం నాలుగు గంటలు మాత్రమే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లలో తీవ్రమైన రద్దీ నెలకొంది. జనం నిత్యావసరాల కోసం ఉదయం నుంచి క్యూ కట్టి బారులు తీరారు. లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది సొంతూళ్లకు పయనం అయ్యారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి. దీంతో నగరంలోని పలు రోడ్డు ట్రాఫిక్ జామ్‌తో నిండిపోయాయి. అదేవిధంగా నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రయాణికుల రద్దీ నెలికొంది. మరోవైపు తెలంగాణలో యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో రెండో డోసు వారికే వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కోసం తెలంగాణలో పలు టీకా కేంద్రాల దగ్గర ప్రజలు భారీగా క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. ఇక లాక్‌డైన్ ఆంక్షల సడలింపు కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉండడంతో పలు సూపర్ మార్కెట్లు వ్దద ఎటు చూసినా జనమే ఉన్నారు. పలు సూపర్ మార్కెట్లు, దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 6నుంచి 10గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. దీంతో కూరగాయల మార్కెట్లకు ప్రజలు పోటెత్తుతున్నారు. కొన్ని మార్కెట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గ్రేటర్, జిల్లా, ఆర్టీసీ బస్సులకు ఉదయం10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. లాక్‌డౌన్ కారణంగా నగరవాసులు సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో పయణమవుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల బస్సులకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కొనసాగనుంది.
తెలంగాణలో10 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్
రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్ చేసుకున్నవారికి రీ షెడ్యూల్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.