గాలిపటం ఎగరేసే ఈ దారం అమ్మినా , తయారుచేసినా ఏడేళ్ల జైలే…

 

గాలిపటం ఎగరేసే ఈ దారం అమ్మినా ,
తయారుచేసినా ఏడేళ్ల జైలే…

సంక్రాంతి వచ్చిందంటే చాలు పతంగుల సందడే వేరు. ఇప్పుడు ఈ గాలిపటమే వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం పతంగి పైకి ఎగరవేసేందుకు వినియోగించే చైనా మాంజానే. ఈ మాంజా దెబ్బకు మనుషులు, పక్షులు గాయాల బారిన పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చైనా దారంపై తెలంగాణ రాష్ట్రంలో నిషేధంతోపాటు ఎవరు అమ్మినా జైలు శిక్షతోపాటు జరిమానాను విధించనున్నారు.

సంక్రాంతి సంబురాల్లో మనం ఉత్సాహంగా పతంగి పైకి ఎగురవేసేందుకు ఉపయోగించే దారమే పక్షులకు ఉరితాడుగా మారుతుంది. గాలిపటాన్ని ఎగురవేసేందుకు వాడే సాధారణ మాంజాకు బదులుగా సింథటిక్‌ మాంజాను వాడడంతో దుష్ఫరిమాణాలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో తయారు చేసే మాంజా లాగితే తెగిపోతుంది. అయితే చైనా సింథటిక్‌ మాంజా ఎంత లాగినా తెగదు. ఈ దారం పక్షుల కాళ్లు, రెక్కలకు చిక్కుకుని అవి గాయాలపాలవుతున్నాయి. కొన్నిసార్లు పక్షుల రెక్కలు తెగిపోయి అవి పైకి ఎగరలేకపోతున్నాయి.

చైనా మాంజాకు గ్లాస్‌ కోటేడ్‌ వాడకంతో చెట్లపై దారం ఉండడంతో పక్షులు గాయాలపాలవుతున్నాయి. నైలాన్‌ దారంతో పతంగి ఎగురవేసే సమయంలోనూ దిల్లీలో ఒకరు, హైదరాబాద్‌లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వీటన్నింటిని తీవ్రంగా పరిగణించిన జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ చైనా మాంజాపై నిషేధం విధించింది. రాష్ట్రంలోనూ ఈ దారాన్ని నిషేధిస్తూ 2016 జనవరి 13న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం చైనా మాంజా ఉత్పత్తి చేసినా.. నిల్వ చేసినా.. అమ్మకాలు జరిపినా శిక్షార్హులు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం సింథటిక్‌ దారం వినియోగించిన వారికి ఐదేళ్లు జైలు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. జంతువులు, పక్షులకు హాని కలిగిస్తే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు రూ.10 వేలు జరిమానా విధిస్తారు. నైలాన్‌ మాంజా దుష్ఫరిణామాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ప్రకృతి ప్రేమికులు, అధికారులు యోచిస్తున్నారు.

About The Author