శ్రీ విష్ణుదాసు స్వామిగారు ఈ రోజు బ్రహ్మీ ముహూర్తములో శివైక్యం పొందినవారు.


అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి సమీపంలో వెలసిన కోన కాన్వాశ్రమంలో నివసిస్తూ ఎందరో భక్తులకు మార్గదర్శనం చేస్తూ నేటివరకు మనమధ్య జీవించిన శ్రీ విష్ణుదాసు స్వామిగారు ఈ రోజు బ్రహ్మీ ముహూర్తములో శివైక్యం పొందినవారు. వారి వయస్సు సుమారు 80 సంవత్సరాలకు పైబడి ఉంటుంది. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలోనే ఆధ్యాత్మిక అన్వేషణలో ఇల్లు విడిచి ప్రరిభ్రమిస్తూ పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడ భగవాన్ శ్రీ సత్య సాయి దర్శనం పొంది వారి ఆదేశానుసారం చెన్నేకొత్తపల్లి సమీపంలోని పర్వతస్థాణువులలో వెలిసిన తపోక్షేత్రానికి వేంచేసారు.అక్కడ చిన్నపాటి పురాతన మందిరాలు అప్పటికే వెలిసి ఉండేవి. ఒక స్త్రీ మూర్తి అక్కడ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉండేవారు. వారి పరిచయం కావడం వారికి శిష్యులుగా ఇక్కడే ఉండిపోయి ఆధ్యాత్మిక సాధన కొనసాగించారు. వారు పూర్తిగా హిందీ మాధ్యమంలో హైస్కూలు విద్యనభ్యసించారు. తెలుగు బాషలో వారికి ఏ మాత్రము ప్రవేశము లేకపోయినా సాధన చేసి బాషను నేర్చుకొని తెలుగు గ్రంధాలను బాగా పఠించేవారు. 35 సంవత్సరాలకు పూర్వము అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీ ఎస్.పి.టక్కర్ గారికి వారు బాల్య మిత్రులు ప్రాథమిక పాఠశాలలో సహపాటి కావడం వల్ల వారు ఇరువురు తరచుగా కలుసుకొనేవారు. వారి సహకారంతో ఆశ్రమంలో నీటి వసతి కోసం చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు.అనేక మంది భక్తులకు నిత్యాన్నదాన సౌకర్యాన్ని ఏర్పరిచారు. గోసంతతిని బాగా వృద్ధి చేశారు. దాదాపు 20 మంది వృద్ధులు ఆశ్రమ వాసులుగా అక్కడ జీవిస్తున్నారు. ఆశ్రమానికి చక్కటి రోడ్డు నిర్మాణము గావించి భక్ట్జులకు అనేక సౌకర్యాలు కలుగజేసి ఎప్పుడూ భక్తుల రాక పోకతో నేడు రద్దీగా ఉంటుంది. 12 –13 ఏళ్ల చిరుప్రాయములోనే వారు మాతా పితరులను వదలి కోన కన్వాశ్రమానికి రావడం తలిదండ్రులు ఆచూకీ తెలుసుకొని వచ్చి వీరిని ఇంటికి తీసుకొని పోడానికి ప్రయత్నించినా వారు వెళ్లకుండా ఇక్కడే తన సాధనను కొనసాగించి శివైక్యం చెందడం అంతా ఋణానుబంధం దైవ సంకల్పం. పరమాత్మ ప్రసాదించిన జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి శ్రీ విష్ణుదాసు గారు.

About The Author