కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి
కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. వైరస్ బారినపడి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో చోటు చేసుకుంది. నెల్లికుదురుకు చెందిన మద్ది భిక్షం(65)కు భార్య, ముగ్గురు కొడుకులున్నారు. ఇందులో పెద్దకొడుకు వీరన్న(40) నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు రామచంద్రు హైదరాబాద్‌లో, మూడో కుమారుడు ఉపేందర్(32) హన్మకొండలో ఉంటున్నారు. ఇటీవల ఆరోగ్యం సహకరించకపోతే మహబూబాబాద్‌లోని వీరన్న ఇంటికి భిక్షం దంపతులు వెళ్లారు. కొద్దిరోజులకే వీరన్న కోవిడ్ బారిన పడగా గూడూరు మండలంలోని క్వారంటైన్ కేంద్రానికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.అదే సమయంలో భిక్షంకు కూడా కోవిడ్ సోకగా హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ భిక్షం ఈనెల 2న, వీరన్న 4న కన్నుమూశారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే కరోనా బారిన పడిన మూడో కుమారుడు ఉపేందర్‌ను కూడా హైదరాబాద్‌కు తరలించగా ఈనెల 11న మృతి చెందారు. ఇక కరోనాతో ఇబ్బంది పడుతున్న భిక్షం భార్య మంగమ్మ(60) గురువారం మృతి చెందడంతో ఈ కుటుంబంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. చివరకు వైరస్ బారినపడి మృతిచెందిన ఉపేందర్ భార్య కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.