ఉద్యోగాల మేళ.. ఐటీ రంగంలో 3 లక్షల జాబ్స్
ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ చేపట్టేందుకు కంపెనీలు సిద్ధమవు తున్నాయి. కరోనా ప్రభావం ఉన్నా కూడా మానవ వనరుల అవసరం ఉన్న నేపథ్యంలో రిక్రూట్ చేసుకు నేందుకు సన్నద్ధం అవుతు న్నాయి. దీంతో ఈసారి ఐటీ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌లోనూ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపట్టిన కంపెనీలు.. ఈసారి కూడా నియామకాలు చేపట్టనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ కింద విద్యార్థులను తీసుకుంటుండగా, మరికొన్ని కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రారంభిం చాయి.
కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం కొనసాగుతున్నందున ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావట్లేదు. ప్రత్యక్ష బోధన ఆగిపోవడం, లాక్‌డౌన్ వంటి కారణాలతో రిక్రూట్ మెంట్‌కు అవసరమైన నైపుణ్యా లను విద్యార్థులు పెంపొం దించుకోవట్లేదు. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉంది. గతేడాది ఇదే జరిగిందని ఐటీ నిపు ణులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో (జూన్) క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను కంపెనీలు వేగవంతం చేయను న్నాయి. ప్రధాన కంపెనీలు దేశంలో1.1 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందు కొస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం 1.1 లక్షల ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒక మిగతా కంపెనీలు, గతేడాది భర్తీకాని ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా దేశంలో ఈసారి 3 లక్షల వరకు ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
టీసీఎస్‌లోనే 40 వేల ఉద్యోగాలు..
అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు టీఎస్‌ఎస్ చర్యలు చేపట్టినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది టీసీఎస్‌లో 40 వేలు, ఇన్ఫోసిస్ 25 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. డీఎక్స్ టెక్నాలజీ, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశముంది. గతేడాది అన్ని కంపెనీలు 2.1 లక్షలు ఉద్యోగాలను కల్పించాలని భావించినా.. సరైన నైపుణ్యాలు కలిగిన 1.2 లక్షల మందినే తీసుకున్నారు. 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రధానమైన 5 కంపెనీలు కాకుండా మిగతా కంపెనీల్లో మరో లక్షకు పైగా, గతేడాది మిగిలిపోయిన ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో లభించే అవకాశం ఉంది.
ఇన్ఫోసిస్‌లో ఇప్పటికే ప్రారంభం
ఇన్ఫోసిస్ కంపెనీ తన సర్వీసెస్, ప్రోడక్ట్ డివిజన్లకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ఏటా నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇన్ఫీటీక్యూ, హ్యాక్‌విత్ ఇన్ఫీ అనే డ్రైవ్ నిర్వహించింది. మిగతా కంపెనీలు అదే బాటలో వెళ్లనున్నాయి. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కోసం ఇన్ఫీ టీక్యూను సర్వీసెస్ కోసం, హ్యాక్‌విత్‌ఇన్ఫీ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్స్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇన్ఫీటీక్యూను సర్వీసెస్‌కు, హ్యాక్‌విత్ ఇన్ఫీలో ప్రోడక్ట్ డివిజన్లకు చేపట్టింది. వాటికి దేశంలో 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కొరత కారణంగా 60 శాతం మందినే తీసుకున్నట్లు తెలిసింది. అందులో 3 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. క్యాప్ జెమినీ తమ అనుబంధ కాలేజీల్లో 30 వేల నియామకాలకు జూన్, జూలైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేపట్టింది. అయితే అందులో 45 శాతం మందే నైపుణ్యాలు కలిగిన వారు నియమితులయ్యారు. టీసీఎస్ గత ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్‌క్యూటీ, డిజిటల్ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్ డ్రైవ్‌లను నిర్వహించింది. విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం తదితర కంపెనీలు నియామకాలను చేపట్టాయి. గతేడాది హైదరాబాద్ ఐటీ జోన్ నుంచి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కంపెనీల్లో 45 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 25 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
ఉద్యోగాలకు దూరమైన 40 శాతం మంది..
కరోనా సెకండ్ వేవ్ ధాటికి కాలేజీలు మూతపడ్డాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం వల్ల ఆన్‌లైన్ తరగతులు బారిన పడుతుండటం వల్ల ఆన్‌లైన్ తరగతులు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెజారిటీ విద్యార్థులు చదువులకు దూరమై వేరే వ్యాపకాలతో సమయం వృథా చేసుకుంటున్నారు. గతేడాది కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ఉండదని అంతా ప్రిపరేషన్‌ను గాలికి వదిలేశారు. కానీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ముందుకొచ్చాయి. అయితే విద్యార్థులంతా లాక్‌డౌన్‌తో గ్రామాలకు వెళ్లడం, క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధం కాలేకపోయారు. దీంతో కంపెనీలు అవసరమైన వారిలో 60 శాతం మందినే నియమించుకున్నాయి. దీంతో 40 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలను పొందలేకపోయారు.
ఆన్‌లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈసారి కూడా విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీంతో కంపెనీలు కోరుకునే సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు లభిస్తారా లేదా అన్న ప్రశ్న కంపెనీల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ప్రస్తు్తత పరిస్థితులు ఆటంకం కాకుండా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా మారకుండా కంపెనీలే తమ వెబ్‌సైట్ల ద్వారా ‘ఆన్‌లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్’ప్రారంభించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు వీటిని అందిస్తున్నాయి.
సమయం వృథా చేసుకోవద్దు..
క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం విద్యార్థులు ప్రిపేర్ కావాల్సిన సమయం వచ్చింది. ఈ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రిపరేషన్‌లో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంగణ నియామకాలు అకడమిక్ అంశాలకు సంబంధం లేదు. ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఆప్టిట్యూడ్, వెర్బల్, సి, డీఎస్, జావా లేదా పైతాన్ వంటి వాటిపై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కోడింగ్ ప్రాక్టీసు మొదలు పెట్టాలి. అడ్వాన్స్ డీఎస్ ప్రాక్టీస్ చేయాలి. అల్గారిథమ్స్‌పై పట్టు సాధించాలి. ఈజీ నుంచి మొదలుకొని మోడరేట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్స్‌ని ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ సామర్థ్యం పెరిగిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ వంటి కోడింగ్ ప్లాట్‌ఫారం, హాకథాన్స్‌లో పాల్గొనాలి. కోడింగ్ చేయగలమనే నమ్మకం వచ్చినప్పుడు ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి. లింక్‌డ్‌ఇన్‌లో ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్‌లు చాలా ఉంటాయి. దఇంటర్న్‌షిప్ చేశారంటే ఉద్యోగానికి సులభంగా ఎంపిక కావొచ్చు.
– కాంచనపల్లి వెంకట్, ఫౌండర్ సీఈవో, సన్‌టెక్ కార్ప్ సొల్యుషన్స్ ప్రాంగణ నియామకాల శిక్షణ సంస్థ