నట భూషణ్ శోభన్ బాబు గారికి జయంతి నివాళి…
తెలుగు వారి అందాల నటుడు నట భూషణ్ శోభన్ బాబు గారికి జయంతి నివాళి..
వెండితెర ఎవర్గ్రీన్ అందగాడు అంటే నటభూషణుడు మాత్రమే. ఆరడుగుల ఆజానుబాహుడు. స్వచ్ఛమైన మనసు ఆయన్ని ఆరు పదుల్లో కూడా అందంగానే చూపించింది. ఆనాటి నటీమణుల్లో ఆయన తో నటించని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. శారద మొదలుకుని నిన్న మొన్నటి హీరోయిన్ ప్రియా రామన్ వరకు ఆయన పక్కన నటించి కుటుంబ కథా హీరోయిన్ జాబితాలో చేరిన వారే. జయలలిత ఆయన కి మంచి జోడిగా పేరు తెచ్చుకుంటే, వాణిశ్రీ గారు మాత్రం ఆయన పక్కన అల్లరమ్మాయిగా అలా కుదిరిపోయారు అంతే. ఇంక ఈయన హీరోయిన్స్ గీతాంజలి గారు, భారతి, రాధ, విజయశాంతి కూడా ఆయన తో ఆడి పాడినవారే. నిన్నటి తరం నటులు తో జత కూడిన ప్రతి హీరోయిన్ ఆయన స్కూల్ నుంచి వచ్చినవారే.
అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలలో రాణించారు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. సినీరంగంలో ఉన్నా శోభన్ బాబును క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు. అతను ఎన్నడూ ఎటువంటి వ్యసనాలకు లోను కాలేదు. వయసు పైబడుతున్నపుడు కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు. వ్యక్తిగా శోభన్ బాబు చాలా నిరాడంబరుడు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు.ఎన్నటికీ ప్రేక్షకులు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి చెప్పాడు. 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆయన అందరికీ ఆదర్శప్రాయులే.
ఈరోజు తెలుగువారి అందాల కథానాయకుడు నటభూషణ్ ‘శోభన్ బాబు’ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించికుందాము..