ప్రైవేట్ అంబులెన్సుల దందాలు అరికట్టండి…తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీకి సిపిఎం వినతి


తిరుపతి నగరంలో ప్రైవేటు అంబులెన్సుల దందాల కారణంగా ప్రజలు అల్లాడి పోతున్నారని, కరోన రోగుల నుండి ఇష్టానుసారంగా అధిక ధరలతో దోచేస్తున్నారని, వెంటనే అంబులెన్స్ ల దందాను అరికట్టాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీకి సిపిఎం నేతలు కందారపు మురళి, టి. సుబ్రమణ్యం, ఆర్ లక్ష్మి లు శుక్రవారం నాటి ఉదయం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ తిరుపతి నగరంలో రెండు కిలోమీటర్ల దూరానికి 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పేషెంట్ల నుంచి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే అంబులెన్సులకు నిర్ణీత రేట్లు నిర్ణయించి రోగుల ప్రాణాలు, ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. స్వీమ్స్,రుయా వద్ద వున్న అంబులెన్స్ లకు, ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ లకు నిర్ణీత రేట్లు నిర్ణయించాలని, నోటీస్ బోర్డ్ లో రేట్ల వివరాలను పొందు పరచాలని కోరారు. అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్పందిస్తూ ప్రైవేటు అంబులెన్స్ ల దందాలను అరికడతామని హామీ ఇచ్చారు. ప్రతి అంబులెన్సు వాహనం పై ధరల పట్టిక ఉండేట్టు చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు ఆసుపత్రుల ముందు ధరల పట్టిక లు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ధరలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ వివరించారు. అంబులెన్సుల పై వస్తున్న ఫిర్యాదులను ఆధారం చేసుకుని వాహన యజమానులకు శుక్రవారం నాడు కౌన్సిలింగ్ ఇచ్చామని, కరోనా పేషెంట్ల నుంచి బలవంతంగా పెద్ద మొత్తాలు వసూలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు పెడతామని హెచ్చరించారు. నిర్దిష్టమైన ఘటనలు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని సిపిఎం నేతలను ఎస్పీ కోరారు. అంబులెన్సు యజమానులు వేధింపులకు పాల్పడితే తమకు ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ తో చర్చించామని, ఉత్తర్వులతో కూడిన ఆదేశాలు వెలువడతాయని, కలెక్టర్ ఆదేశాల కు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం నగర కార్యదర్శి టి. సుబ్రమణ్యం, నాయకులు ఆర్ లక్ష్మి, గురు ప్రసాద్, ముని రాజ, అక్బరు , రవి,హేమంత్,రుక్కు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు…టి.సుబ్రమణ్యం సిపిఎం నగర కార్యదర్శి తిరుపతి

About The Author