కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై చురుగ్గా పరిశోధనలు


రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
అమరావతి, మే 21 : కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయత, సత్ఫలితాలపై రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర ఆయూష్ అధికారులు కూడా పరిశోధనలు జరుపుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా నివారణకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందును కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 92,231 కరోనా టెస్టులు చేయగా, 20,937 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 104 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,408 ఐసీయూ బెడ్లు ఉండగా, 5,889 కరోనా బాధితులతో నిండి ఉన్నాయన్నారు. ఆక్సిజన్ 23,876 బెడ్లు ఉండగా, 22,492 రోగులతో నిండి ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 18 వేల మంది చికిత్స పొందుతున్నారన్నారు. రోజవారీ కేటాయింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గడిచిన 24 గంటల్లో 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించుకున్నామన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రభుత్వాసుపత్రులకు 24,352 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచగా, ప్రైవేటు ఆసుపత్రులకు 16,713 ఇంజక్షన్లు సరఫరా చేశామన్నారు. గడిచిన 24 గంటల్లో కాల్ సెంటర్ కు 10,919 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 10 రోజుల కిందట వరకూ 18 వేల ఫోన్ కాల్స్ వరకూ వచ్చేవని, ఇపుడా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో వచ్చిన 10,919 ఫోన్ కాల్స్ కు వివిధ సమాచారాలకు 3,508 కాల్స్ వచ్చాయన్నారు. అడ్మిషన్లకు 3,271, టెస్టులకు 2,403, టెస్టు రిజల్ట్ కు 1,320 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. టెస్టు రిజల్ట్ సకాలంలో ఇస్తుండడంతో, దీనికి సంబంధించిన ఫోన్ కాల్స్ తగ్గాయన్నారు. గడిచిన 24 గంటల్లో హోం ఐసోలేషన్, జ్వరపీడితులకు 23,772 మందికి, గురువారం నాడు 31 వేల మందికి ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ల చేసుకున్న వైద్యులు ఫోన్ చేసి…సలహాలు సూచనలు అందజేశారన్నారు. అవుట్ గోయిగ్ కాల్స్ సంఖ్య గణనీయంగా పెంచామన్నారు.
ఆరోగ్య శ్రీ కింద 77 శాతం మందికి ఉచిత వైద్య సేవలు
కొవిడ్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాల వివరాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో 38,763 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 28,189 మంది ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కలిపి 77 శాతం మంది ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్య సేవ పొందుతున్నారన్నారు.
ఫస్ట్ డోస్ గా కొవిషీల్డ్ వేస్తాం…
ఇప్పటి వరకూ రాష్ట్రానికి 76,49,960 కరోనా వ్యాక్సిన్ డోసులు కేంద్రం నుంచి వచ్చాయని, 76,55,575 డోసు లు వినియోగించుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 23,03,655 మందికి రెండు డోసులు ఇచ్చామని, 30,48,265 మంది ఒక్క డోసు ఇచ్చామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 1,33,532 మందికి కోవాగ్జిన్ సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మే 15 నుంచి జూన్ 15 వరకూ 11,18,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కేవలం జూన్ నెల కోటాకు సంబంధించి 11,45,540 డోసులు కొవిషీల్డ్, కొవాగ్జిన్ 3,40,680 కొవాగ్జిన్ డోసులు…ఇలా మొత్తం 14,86,220 డోసులు కేంద్రం నుంచి రానున్నాయని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను సెకండ్ డోసు వినియోగించాల్సి ఉంటుందని, 8,12,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఫస్ట్ డోస్ గా వాడుకుంటామని తెలిపారు. ఇదే విషయమై మార్గదర్శకాలను కలెక్టర్లకు జారీచేశామన్నారు.
డీఆర్డీవో మందుల కొనుగోలుకు సీఎం ఆదేశం…
రాష్ట్ర అవసరాలు నిమిత్తం మే నెలలో 13,41,700 కొవిషీల్డ్ వ్యాక్సిన్లను, 3,43,930 కొవాగ్జిన్ డోసులను సొంతంగా కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. మే నెలలో 16,85,000 డోసులు, జూన్ కు సంబంధించి 14,86,000 డోసులు… ఇలా మొత్తం 31.05 లక్షలలు కొనుగోలు చేశామన్నారు. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు ముందుగా వేస్తామని, తరవాతే 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనన్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందులు కొనుగోలుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో డీఆర్డీఏ మందుల కొనుగోలుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణపట్నం ఆయుర్వేద మందు ఫలితాలపై ఆరా….
కృష్ణపట్నంలోని ఆయుర్వేద మందు శాస్త్రీయతపై రాష్ట్ర స్థాయి అధికారులను పూర్తి వివరాలు అందజేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రానికి చెందిన ఆయుర్వేద డాక్టర్లు కొద్ది రోజుల కిందట కృష్ణపట్నం వెళ్లి అక్కడి వారితో మాట్లాడడమే కాకుండా ఆయుర్వేద మందును హైదరాబాద్ లోని ల్యాబ్ లో పరీక్షలు కూడా చేశారన్నారు. ఈ పరిశోధనలో నష్టకలిగించే వివరాలు తెలియరాలేదన్నారు. ప్రజల నమ్ముతున్నా… సైంటిఫిక్ గా తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆయూష్ కమిషనర్, కొందరు టెక్నికల్ అధికారులు ప్రస్తుతం కృష్ణపట్నం గ్రామంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని రాష్ట్ర అధికారులకు శనివారం స్థానిక తయారీదారులు వివరించనున్నారన్నారు. దీనిద్వారా ఆయుర్వేద మందుపై ఒక అవగాహన కలుగుతుందన్నారు. దేశ మంతా తెలియడంతో కేంద్ర ఆయుర్వేద అధికారులు కూడా ఆయుర్వేద మందు గురించి ఆరా తీస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను కూడా కేంద్ర ఆయుర్వేద అధికారులతో మాట్లాడానన్నారు. విజయవాడలో ఉన్న ఐసీఎంఆర్ రీజనల్ బ్రాంచ్ కు చెందిన కొందరు అధికారులు కృష్ణపట్నం గ్రామానికి సోమవారం వెళతారన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించనున్నారన్నారు. ఆయుర్వేద మందుపై రిపోర్టు ఇవ్వనున్నారన్నారు. ఇందుకు కొద్ది రోజులు సమయపడుతోందని, ఆ తరవాతే ఆయుర్వేద మందు ఫలితాలపై అవగాహన వస్తుందని ఆయన వెల్లడించారు.
గమనిక : ఫొటోలు ఉన్నాయి…
జారీచేసిన వారు : పబ్లిసిటీ సెల్, I&PR, సచివాలయం, అమరావతి.

About The Author