ఆనందయ్య మందు పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి ఆరా..
*· కేంద్ర మంద్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి*
*· వీలైనంత త్వరగా పరిశోధన పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి సూచన*
27 మే, 2021, న్యూఢిల్లీ
నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆరా తీశారు. ఈ ఉదయం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజుకు ఫోన్ చేశారు. పరిశోధన పురోగతి గురించి గౌరవ ఉపరాష్ట్రపతికి వివరించిన కేంద్ర మంత్రి, భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రాలయ పరిధిలో ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం వారి సహకారంతో ఆనందయ్య మందును ఇప్పటికే వాడిన 500 మంది నుంచి వివరాలు సేకరించి, పరిశోధన జరుపుతున్నామని, వీలైనంత త్వరలోనే పరిశోధన పూర్తి చేసి నివేదికను సిద్ధం చేస్తామన్నారు.
జనబాహుళ్యానికి చెందిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధన చేయవలసి ఉంటుందని అందువల్ల కాస్త సమయం పడుతోందని తెలిపారు. విషయంపై రాజీ పడకుండా, వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు.
అనంతరం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ. బలరాం భార్గవ్ తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిది గనుక, ఇప్పటికే ఆయుష్ వారి పరిశోధన ప్రారంభమై, కొనసాగుతున్న నేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.