భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు


”నా అనుమతి లేకుండా భార్య తన ఫోన్‌లోని ఫోటోలను వేరేవాళ్లకు పంపించి ప్రైవసీకి భంగం కలిగించింది. నాపై నిఘా పెట్టిందని.. అది నాకు ఇష్టం లేదని.. నష్ట పరిహారం ఇప్పించాలంటూ” కోర్టుకెక్కాడు. అతని వాదనలు విన్న కోర్టు వ్యక్తి భార్యకు 5,400 దిర్హమ్‌లను నష్టపరిహారంగా చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. ఈ వింత ఘటన అబుదాబిలో చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే.. అబుదాబికి చెందిన దంపతులు పెళ్లైన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కాలం గడిచు కొద్ది భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఆమెకు తెలియకుండా ఫోన్‌లో ఏవో సీక్రెట్స్‌ దాస్తున్నాడని తనలో తాను భావించింది. ఈ క్రమంలో ఆమె తన భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది. అంతటితో ఊరుకోకుండా తన భర్త ఫోన్‌లో ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తన వాళ్లకే పంపించింది. విషయం తెలుసుకున్న భర్త భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.

భర్త తరపు లాయర్‌ మాట్లాడుతూ… ” తన క్లయింట్‌ వ్యక్తిగత గోప్యతను అతని భార్య హరించింది. అతని అనుమతి లేకుండా ఫోటోలను కుటుంబసభ్యులకు పంపించి అతన్ని మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేసింది. ఈ కేసు కారణంగా అతను ఉద్యోగానికి కూడా వెళ్లలేకపోయాడని.. దీంతో అతను ఆర్థికంగా నష్టపోయాడు” అని తన వాదన వినిపించాడు. ఇంతలో భార్య తరపు లాయర్‌ మాట్లాడుతూ.. తన క్లయింట్‌ ఎటువంటి తప్పు చేయలేదని.. భర్త చేతిలో తాను మానసిక క్షోభను అనుభవించిందని తెలిపాడు. ఇరువరి వాదనలు విన్న కోర్టు భర్త ప్రైవసీకి భంగం కలిగించి అతని గోప్యతను దెబ్బతీసిన అతని భార్యకు 5,400 దిర్హమ్‌లు( రూ. లక్ష) నష్టపరిహారంగా చెల్లించాలంటూ వినూత్న తీర్పు ఇచ్చింది.

About The Author