యుగపురుషులు అన్న ఎన్టీఆర్
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి గురించి కొన్ని విషయాలు మీకోసం..
ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ
నందమూరి తారక రామారావు ఒకరు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే.. కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్రలేదు. పౌరాణిక, ఇతిహాసాల దగ్గర నుంచి జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేసేశారాయన. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ‘అన్న’ ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్.
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 99వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి గురించి కొన్ని విషయాలు మీకోసం..
నందమూరి తారక రామారావు
‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తాం అంటూ రాయబారాలు మొదలయ్యాయి. ‘లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరు’ అనే వివేకానందుడి మాటల్ని ఒంటపట్టించుకున్న ‘అన్న’ ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు.
చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ‘రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్’ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరాజిల్లింది. ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు.. రాజకీయ నేతగానూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
ప్రజా జీవితంలో ఎన్టీఆర్
అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు.. తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. ‘పేదవాడే నా దేవుడు.. సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ.. దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులు.. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.. అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక.. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.
కుమారులు, అల్లుళ్లలతో ఎన్టీఆర్
1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు ఎన్టీఆర్ జన్మించారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తరవాతే ఆయన బి.ఎ. పూర్తిచేశారు. తొలి సంతానం కలిగిన తరవాత ఆయన రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ, ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మద్రాసు పట్టణానికి బయలుదేరి వెళ్లారు.
తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా.. గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ముప్పైమూడేళ్ల వెండితెర జీవితంలో, పదమూడేళ్ల రాజకీయ జీవితంలో నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్.. 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు.