ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి


గురుగ్రామ్​లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. హర్యానాలోని గురుగ్రామ్​కు చెందిన వినిత, సర్పరాజ్ ​దంపతులు. అయితే, వినిత దుండహేరా గ్రామంలోని పార్క్​ అనే ప్రైవేటు ఆసుపత్రిలో ఏప్రిల్​ 23న గర్భ విచ్చిత్తి చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్​లు ఆమెకు యాంటి బయోటిక్​ ఇంజక్షన్​ ఇచ్చారు.అయితే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. ఆమె కుడి చెయి క్రమంగా నల్లగా మారింది. వెంటనే, ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మందులను మార్చారు. అయినా ఆమెలో మార్పురాలేదు. ఈ క్రమంలో ఆమెను ఎక్స్​రే తీశారు. దీంట్లో ఆమె చేయి నల్లగా మారడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్‌కు గురైందని తెలిసింది. కాగా, ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్​ఎమ్​ఎల్​ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పార్క్ వైద్య సిబ్బంది సలహ ఇచ్చారు.

గర్భాస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీ బయోటిక్​ ఇంజక్షన్​ ఇవ్వడం వల్లనే తన భార్యకు ఇలా జరిగిందని సర్పరాజ్​ ఆరోపించాడు. కాగా, తన భార్యను తీసుకొని వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. వినితను అక్కడి వైద్యులు పరీక్షించారు. ఆమె కుడి చేయి పూర్తిగా ఇన్​ఫెక్షన్​కు గురైందని వెంటనే తొలగించాలని తెలిపారు. దానికోసం చాలా ఖర్చుఅవుతుందని కూడా తెలిపారు. అసలే.. కొవిడ్​ కారణంగా సర్పరాజ్​ ఉద్యోగాన్ని కోల్పోయాడు.

కాగా, తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటివరకు నెట్టుకొచ్చానని తెలిపాడు. కాగా, వీరికి ఒక ఎన్జీవో ఆహరాన్ని అందిస్తుంది. తాను ఆపరేషన్​కు అయ్యే ఖర్చుకూడా భరించే స్థితిలో లేనని పేర్కొన్నాడు. ఈ దారుణంపై గురుగ్రామ్​ చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

About The Author