పాలను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా? ఎప్పుడు..ఎలా..?
గదిలో ఉండే అతి ముఖ్యమైన పదార్థాలలో పాలు ఒకటి. ఇంకో రకంగా చెప్పాలంటే.. చాలా మంది రోజు మొదలవడానికి.. పూర్తవడానికి పాలు తప్పనిసరి. ఎందుకంటే ఉదయాన్నే లేవగానే టీ, కాఫీలు తాగితే గానీ పని చేయలేనివారు.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే కానీ నిద్రపట్టని వారు చాలా మంది ఉన్నారు.
అవసరానికి మించి కొని పెట్టుకున్న పాలను చాలా మంది ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఈ క్రమంలో అవి గడ్డకడుతుంటాయి. తర్వాత అవసరం ఉన్నప్పడు వీటిని తీసుకుని ఉపయోగిస్తుంటారు.
ఇలా చేయడం మంచిదేనా..?, అసలు పాలు ఎన్ని రోజుల వరకూ వాటి నాణ్యతను కోల్పోకుండా ఉంటాయి..?, గడ్డకట్టిన పాలు ఉపయోగించవచ్చా..?
అనే అనుమానాలు చాలా మందికి కలిగే ఉంటాయి కదా. వీటికి సమాధానాలతో పాటు పాలను ఎప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి..?, పెట్టడానికి ముందు ఎలాంటి చిట్కాలు పాటించాలో కూడా తెలుసుకోండి..
“పాలను రిఫ్రిజిరేటర్లలో
పెట్టొచ్చా’..?
పాల ప్యాకెట్ తెరిచిన తర్వాత పాలు నాలుగు నుంచి ఏడు రోజులు మాత్రమే బాగుంటాయి. ఈ సమయంలో పాలను ఫ్రిజ్ లో ఉంచి తర్వాత వాడుకోవచ్చు. అలాగే తెరవడానికి ముందు పాలను ఫ్రిజ్‌లో నెలల పాటు ఉంచవచ్చు. కానీ ఉత్తమ నాణ్యత కలిగిన పాలు కావాలంటే నెలలోపే వాటిని వాడటం మంచిదని నిపుణులు చెబుతుంటారు.
“పెట్టేముందు ఏం చేయాలి”..?
1. పాలను రిఫ్రిజిరేటర్లలో పెట్టిన ప్రతిసారి.. దాదాపు పాత్రలో 1 నుంచి 1.5 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకొండి. ఎందుకంటే పాల గట్టకట్టినప్పుడు పరిమాణం పెరుగుతుంది.
నిండుగా ఉండటం వల్ల పాలు విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.
2. పాలను ఎప్పుడు ఫ్రిజ్ లో పెట్టినా గాలి చొరబడని కంటైనర్ లోనే నిల్వ చేయండి. ఎందుకంటే ఇవి ఫ్రిజ్ లోని ఇతర ఆహార పదార్థాల నుంచి దుర్వాసన తీసుకునే ప్రమాదం ఉంది. ఇలా జరగడం వల్ల పాలు తమ రుచిని కోల్పోతాయి.
3. పాలను ఫ్రిజ్ లో పెట్టేందుకు మరో మంచి మార్గం ఏంటంటే.. వీటిని ఐస్ క్యూబులలో పోసి గడ్డకట్టేలా చేయడం. అవి గడ్డకట్టిన తర్వాత వాటిని హెవీ డ్యూటీ రీ-సీలబుల్ ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కంటైనర్‌లో ఉంచండి. ఈ పద్ధతి మీకు ఫ్రీజర్ స్థలాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
“గడ్డకట్టిన పాలను ఎలా కరిగించాలి”..?
1. బాక్టీరియా పెరుగుదల ప్రమాదాన్ని తగ్గించాలంటే పాలను గది ఉష్ణోగ్రతలో కాకుండా ఫ్రిజ్‌లో కరిగించాలి.
ఎందుకంటే ఎక్కువసేపు పాలు గది ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా వాటిని చేరుతుంది.. ఈ పాలు తాగడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉంది.
2. గడ్డకట్టిన పాలను త్వరగా కరిగించడానికి దానిని చల్లటి నీటిలో ఉంచవచ్చు. అయితే, ఈ పద్ధతి బ్యాక్టీరియా పెరుగుదలకు కొంచెం ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఘనీభవించిన పాలను వెచ్చని లేదా వేడి నీటిలో కరిగించవద్దని నిపుణులు చెబుతున్నారు.
3. ప్రత్యామ్నాయంగా మీరు వంట చేస్తున్నప్పుడు నేరుగా కుండలో లేదా పాన్లో వేసి కరిగించొచ్చు.
వేటికి ఉపయోగించుకోవచ్చు..?
ఘనీభవించి, కరిగించిన పాలు వంట చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే బేకింగ్ లేదా స్మూతీస్ తయారీకి వాడొచ్చు. వీటిని తాగడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు ఆహార నిపుణులు.