కరోనా మూడో వేవ్‌ వస్తుందా?.. వస్తే.. ఎలా గుర్తించాలి?


కరోనా వైరస్‌ వ్యాప్తి ఏడాదిన్నర కింద చైనాలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదై తగ్గిన కొన్ని దేశాల్లో రెండో వేవ్‌ వచ్చింది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు గడగడా వణికిపోయాయి. అప్పట్లో మన దేశంలో కేసులు రోజుకు లక్ష స్థాయి దాకా వెళ్లి త్వరగానే తగ్గాయి. రెండో వేవ్‌లో మాత్రం కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా మూడో వేవ్‌ కూడా రావొచ్చన్న నిపుణుల అంచనాలతో ఆందోళన మొదలైంది. మరి ఈ వేవ్‌లు ఏమిటి, ఎన్ని రోజులకోసారి ఇలా జరుగుతుంది, మన దగ్గర మూడో వేవ్‌ వస్తుందా, దీనికి పరిష్కారం ఏమిటన్న అంశాలు
తెలుసుకుందాం..
కరోనా వేవ్‌లు.. ఏమిటివి?
ఒక్క కరోనా అనే కాదు.. పలు రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు మహమ్మారిగా మారి భారీ స్థాయిలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి దశలు దశలుగా విజృంభిçస్తుంటే.. మధ్యలో విరామం ఏర్పడుతుంటుంది. ఇలా జరగడాన్ని వేవ్‌లుగా లేదా ఫేజ్‌లుగా చెప్తుంటారు.
►వైరస్‌ వ్యాప్తి పెరిగినప్పుడు అది సోకినవారి సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతూ వెళ్లి.. ఒక స్థాయికి చేరాక వేగంగా తగ్గుతూ వస్తుంది. మళ్లీ కొంతకాలం తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగి, తగ్గుతుంది. దీనిని గ్రాఫ్‌గా గీస్తే.. వేవ్‌ల పరిస్థితి అర్థమవుతుంది. భవిష్యత్తులో మళ్లీ మహమ్మారి వ్యాపించే అవకాశాలను గుర్తించవచ్చు.

మళ్లీ వస్తే.. ఎలా గుర్తించాలి?
ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇలా కొద్దిరోజుల పాటు దేశమంతటా కరోనా కేసులు పడిపోతాయి. కొంతకాలం తర్వాత మళ్లీ కేసుల పెరుగుదల ఏదైనా ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా మొదలై, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వెళ్లడం, అదీ కొన్నివారాల పాటు కొనసాగడం జరిగితే.. దానిని మూడో వేవ్‌గా పరిగణించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

జాగ్రత్త పడకుంటే ఆరేడు నెలల్లోనే..
వ్యాక్సినేషన్‌ వేగం పెంచడం, కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడాన్ని పక్కాగా అమలు చేయకుంటే.. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్‌ ఎం.విద్యాసాగర్‌ స్పష్టం చేశారు.

మూడో వేవ్‌ తప్పించుకోవచ్చు..
కఠిన నిబంధనల అమలు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూడో వేవ్‌ను తప్పించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారు కె.విజయరాఘవన్‌ ఇటీవల పేర్కొన్నా రు. లేకుంటే మూడో వేవ్‌ తప్పదని తెలిపారు.

మన దేశం… పరిస్థితి ఇదీ..
కరోనా వ్యాప్తి మొదలైన ఏడాదిన్నరలో మన దేశంలో రెండు సార్లు కేసులు పెరిగి తగ్గాయి. ఈ రెండు వేవ్‌ల మధ్య నామమాత్రంగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు గతేడాది మార్చి నుంచి పెరుగుతూ సెప్టెంబర్‌ 16 నాటికి రోజుకు 97 వేల స్థాయికి చేరి మెల్లగా తగ్గాయి. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేసులు వేగంగా పెరగడం మొదలైంది. మే 5న ఏకంగా 4.14 లక్షల కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రెండో వేవ్‌ క్షీణ దశలో ఉంది.
►దేశం మొత్తంగా చూస్తే ఇలా ఉన్నా.. రాష్ట్రాలు, ప్రాంతాలు, పెద్ద నగరాల వారీగా చూసినప్పుడు వేర్వేరుగా వేవ్‌లు నమోదవడం గమనార్హం.

ప్రాంతాల వారీగా.. లోకల్‌ వేవ్స్‌
కరోనా ప్రాంతాల వారీగా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండకుండా.. ఒకట్రెండు నెలలు కొన్ని రాష్ట్రాల్లో, తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో వేవ్‌ సమయంలో.. మొదట మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు పెరిగాయి. తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో.. అనంతరం కర్ణాటక, తెలంగాణ, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల కనిపించింది.
►దేశవ్యాప్తంగా రెండో వేవ్‌ తగ్గాక కూడా అక్కడక్కడా ప్రాంతాల వారీగా కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఆ కేసులు దేశవ్యాప్తంగా లెక్కలను ప్రభావితం చేసే స్థాయిలో లేకుంటే.. మూడో వేవ్‌గా పరిగణించలేమని స్పష్టం చేస్తున్నారు.

మూడో వేవ్‌.. ప్రమాదకరమా?
సాధారణంగా ఏ మహమ్మారి అయినా వేవ్‌లు వచ్చిన కొద్దీ వైరస్‌ బలహీనం అవుతుంది. అప్పటికి జనంలో ఇమ్యూ నిటీ ఉన్నవారి శాతం పెరిగి, వైరస్‌ ప్రభావం తగ్గుతూ వెళుతుంది. కానీ కరోనా విషయంలో ఈ అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి.
►ఉదాహరణకు భారత్, అమెరికా, బ్రిటన్‌ దేశా ల్లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూస్తే.. మొదటి వేవ్‌ కంటే రెండో వేవ్‌ తీవ్రం గా, ప్రమాదకరంగా ఉండటం గమనార్హం.
►కరోనా మూడో వేవ్‌లో పిల్లలపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందని ఢిల్లీకి చెందిన వైరాలజిస్ట్‌ డాక్టర్‌ రవి, మరికొందరు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
►రెండో వేవ్‌ కంటే మూడో వేవ్‌ ప్రమాదకరమా, ఎవరిపై ప్రభావం ఉంటుందన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందని మరికొందరు స్పష్టం చేస్తున్నారు.

పరిష్కారం.. వ్యాక్సినేషన్‌
కరోనా మళ్లీ పంజా విసిరితే ఎదుర్కొవడం ఎలాగన్న దానిపైనే అందరి దృష్టి ఉంది. దీనికి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్న ఏకైక సమాధానం.. వ్యాక్సినేషన్‌. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్లీ వేవ్‌లు రాకుండా ఉండాలంటే అందరికీ వ్యాక్సిన్లు వేయాలని వారు సూచిస్తున్నారు.
►ప్రస్తుతం మన దేశంలో వేగంగా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఫార్మా కంపెనీలను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటితోపాటు కొత్తగా అనుమతులు వచ్చేవి, దిగుమతి కానున్నవి కలిపి.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది.

About The Author