సంసారానికి పనికిరారనే దిగజారుడు ఆరోపణలు.. దాని కిందకే లెక్క!
కేరళ హైకోర్టు ఓ విడాకుల కేసు తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్తగానీ, భార్యగానీ విడాకుల కోసం ఒకరిపై మరొకరు సంసార జీవితంపై తప్పుడు ఆరోపలు చేయడం హింసించడం కిందకే వస్తుందని పేర్కొంది. గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ముహమ్మద్ ముస్తక్, జస్టిస్ కసర్ ఎడపగ్గత్ ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.
సంసారానికి పనికి రారని, అంగస్తంభన లాంటి దిగజారుడు ఆరోపణలు ఒకరిపై ఒకరు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకోవడం క్రూరత్వం మాత్రమే కాదు.. నేరం కూడా. ఇది వైవాహిక వ్యవస్థను చులకన చేయడమే కాదు.. భార్యాభర్తల బంధాన్ని అవహేళన చేసినట్లే అని ద్విసభ్య న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో తప్పుడు ఆరోపణలు చేసే వాళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్న విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని బెంచ్ అభిప్రాయపడింది.కాగా, కేరళ ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం బాగోలేదని తనకు విడాకులిప్పించాలని అబ్బాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తన భర్తకి అంగస్తంభన సమస్య ఉందని అమ్మాయి ఆరోపించింది. ఇది ముదిరి పరస్పర ఆరోపణలతో మరీ పచ్చిగా కోర్టుకు స్టేట్మెంట్ సమర్పించింది ఆ జంట. దీంతో బెంచ్ అవాక్కయ్యింది. అయితే అమ్మాయి ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో బెంచ్ పైవ్యాఖ్యలు చేసింది. ఇక ఆ ఆరోపణల ఫలితంగా జంట కలిసి ఉండే అవకాశం లేదన్న ఉద్దేశంతో విడాకుల మంజూరీకే మొగ్గుచూపింది.