నకిలీ పోలీసులు నకిలీ విలేకర్లు అరెస్ట్…
*దర్శి:* నకిలీ విలేకర్లు, పోలీసులమని చెప్పి డబ్బులు వసూలు చేసిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డిఎస్పి కె.ప్రకాశరావు తెలిపారు.
స్థానిక డిఎస్పి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
ఈనెల 5న తిరువాయపతి వెంకటేశ్వర్లు కొనకనమిట్ల మండలం నాయుడుపేట నుండి ఆటోలో బియ్యాన్ని కొనుగోలు చేసుకుని గొట్లగట్టు నుండి మునగపాడు గ్రామానికి వెళ్తున్నాడు.
మార్గమధ్యంలో సిద్ధవరంకు చెందిన నలుగురు వ్యక్తులు తాము విలేకర్లు, పోలీసులమని చెప్పి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వెంకటేశ్వర్లు భయపడి రూ.20 వేలు ఇచ్చి వెళ్లిపోయాడు.
తరువాత విచారించగా సిద్ధవరం గ్రామానికి చెందిన ప్రైమ్-9 పత్రిక విలేకరి పొనుగోటి శ్రీనివాసాచారి, అబ్దుల్‌ఖాదర్, మహమ్మద్ రఫీ, వంగపాటి ఏడుకొండలు ఈ డబ్బులు వసూలు చేసినట్లు తిరువాయపతి వెంకటేశ్వర్లు కొనకనమిట్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ వెంకటేశ్వర్లు వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లునాయక్ నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.17 వేలు రికవరీ చేశారు. వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఈకేసును చేధించిన పోలీసులను డిఎస్పి కె. ప్రకాశరావు అభినందించారు.
కార్యక్రమంలో పొదిలి సిఐ సుధాకరరావు పాల్గొన్నారు.