మహా కృత్రిమ సూర్యుడు!


సూర్యుడి కన్నా పదింతల వేడి! అదీ మన భూమ్మీద. అదెలా సాధ్యమంటారా? అదే నిజమైతే చెట్లు, పుట్టలు, గుట్టలు, సముద్రాలు, సమస్త జీవరాశులన్నీ మాడి మసై పోవటం ఖాయమనేగా మీ భయం. అంత భయం అవసరం లేదు. ఇదో చైనా ప్రయోగం. ‘కృత్రిమ సూర్యుడి’ని సృష్టించాలనే ప్రయత్నంలో భాగం. ఎక్స్‌పెరిమెంటల్‌ అడ్వాన్స్‌డ్‌ సూపర్‌కండక్టింగ్‌ టొకమాక్‌ (ఈస్ట్‌) పరికరం సాధించిన ఘనత. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించే ఈ పరికరం ఇటీవల 20 సెకండ్ల పాటు రికార్డు స్థాయిలో 16కోట్ల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించింది. ఇది సూర్యుడి వేడి కన్నా పది రెట్లు ఎక్కువ! స్వచ్ఛమైన, అనంతమైన శక్తిని సృష్టించాలనే చైనా ప్రయత్నంలో ఇదో గొప్ప ముందడుగు. ఇలాంటి అత్యధిక వేడిని స్థిరంగా, ఎక్కువ కాలం కొనసాగేలా చేయటమే తమ తదుపరి లక్ష్యమని చైనాలోని సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన లి మియావో చెబుతున్నారు. అయితే కృత్రిమ సూర్యుడి రూపకల్పనలో ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రయోగాత్మక దశ నుంచి వాస్తవ రూపంలోకి రావటానికి దశాబ్దాలు పడుతుందని అంటున్నారు.

‘కృత్రిమ సూర్యుడు’ అంటే?

కృత్రిమ సూర్యుడిగా భావిస్తున్న ఈస్ట్‌ ఒక రియాక్టర్‌. అధునాతన ప్రయోగాత్మక అణు సంయోగ (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌) పరికరం. చైనాలోని హీఫీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ ఆఫ్‌ ద చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఉంది. ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ (ఐటీఈఆర్‌) కార్యక్రమంలో భాగమైన ఇది 2006లో తొలిసారి ప్రయోగాలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీఈఆర్‌ ప్రాజెక్ట్‌లో భారత్‌, దక్షిణ కొరియా, జపాన్‌, రష్యా, అమెరికా వంటి దేశాలూ భాగస్వాములే. ఈస్ట్‌ ఉద్దేశం- సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ప్రక్రియను అనుకరించి శక్తిని ఉత్పన్నం చేయటం. రెండు, అంతకన్నా ఎక్కువ అణు కేంద్రకాలు ఒకటిగా కలిసిపోవటాన్ని అణు సంయోగం అంటారు. ఉదాహరణకు- నక్షత్రాల్లో హైడ్రోజన్‌ కేంద్రకాలు కలసి హీలియం మూలకంగా ఏర్పడటం. సూర్యుడిలో శక్తి ఉత్పన్నం కావటానికిదే మూలం. న్యూక్లియర్‌ ఫ్యూజన్‌లో పెద్దగా వ్యర్థాలు ఉత్పత్తి కాకుండానే అత్యధిక స్థాయిలో శక్తి ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం అణు విచ్ఛిన్న (న్యూక్లియర్‌ ఫిజన్‌) ప్రక్రియతో శక్తిని పుట్టిస్తున్నారు. ఇందులో భారీ అణు కేంద్రకాన్ని రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో తేలికైన అణు కేంద్రకాలుగా విడగొడతారు. ఈ ప్రక్రియలో శక్తితో పాటు పెద్దమొత్తంలో అణు వ్యర్థాలూ పుట్టుకొస్తాయి. అణు సంయోగ ప్రక్రియలో ఇలాంటి వ్యర్థాలు ఉత్పత్తి అవటం తక్కువ. ఎలాంటి గ్రీన్‌హౌజ్‌ వాయువులూ వెలువడవు. దీనిపై నైపుణ్యం సాధించగలిగితే అతి తక్కువ ఖర్చుతోనే అనంత శక్తిని సృష్టించవచ్చు. కృత్రిమ సూర్యుడి తయారీతో దీన్ని సాధించటం పెద్ద కష్టమేమీ కాదు.

About The Author