సూర్య గ్రహణం నేడే .. మనకు ప్రభావం ఉంటుందా?
ఈ నెల 10న వైశాఖ మాసం అమావాస్య రోహిణి నక్షత్రంలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుందని, ఇది ఆకాశంలో జరిగే ఓ గొప్ప అద్భుతమని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ రోజు సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో ఈ గ్రహణం ఏర్పడుతుందన్నారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో ఉండదని తెలిపారు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడటంతో దీన్ని పాశ్యాత్యులు రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు.
2021లో నాలుగు గ్రహణాలు సంభవిస్తాయి. ఇటీవల ఒక చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్ 10న సూర్య గ్రహణం, నవంబర్ 19న పాక్షిక చంద్ర గ్రహణం, డిసెంబర్ 4న సంపూర్ణ సూర్య గ్రహణం రానున్నాయి. ఈ నాలుగు గ్రహణాలూ భారతదేశంపై ప్రభావం ఉండదని చిలకమర్తి తెలిపారు.
జూన్ 10న ఏర్పడే సూర్య గ్రహణం మనదేశంపై ప్రభావం చూపకపోవడం వల్ల ఎలాంటి గ్రహణ నియమాలూ పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సూర్య గ్రహణం గ్రీన్‌లాండ్, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్, అంటార్కిటిక్, యూరప్, రష్యా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కనబడుతుందని దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా పంచాంగకర్త తెలిపారు. ఈ గ్రహణం ఆయా దేశాల్లో మధ్యాహ్నం 1.42గంటల నుంచి సాయంత్రం 6.41గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
భారత్‌లో నివసించేవారు ఈ గ్రహణంలో ఎలాంటి నియమాలూ పాటించక్కర్లేదు. పైన పేర్కొన్న దేశాల్లో నివసించే భారతీయులు మాత్రం గ్రహణ సమయంలో వారి పరిస్థితులను బట్టి జప, తప, తర్పణ, స్నాన మరియు హోమ విధులు నిర్వర్తించుకోవచ్చు. ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ఏర్పడటం వల్ల వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సంభవించే దేశాల్లో వృషభ రాశివారు గ్రహణ సమయంలో సూర్యారాధన, రాహు, దుర్గాదేవి జపం ఆచరించడం మంచిదని ఆయన సూచించారు.