తెలంగాణకు భారీ వర్ష సూచన..


తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులు, ప్రజలను అలర్ట్ చేసిన వాతావరణ శాఖ అధికారులు
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో అదికాస్తా అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అటు నైరుతి రుతుపవనాలు, ఇటు అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా శుక్రవారం, శనివారం నాడు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తండా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా వరదలు కూడా రావొచ్చని అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు

About The Author