సూర్యాపేటలో తీగ లాగితే.. హైదరాబాద్‌లో కదిలిన డొంక!


నకిలీ విత్తనాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంత చెప్పినా.. కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో నకిలీ దందా చేస్తున్నారు. అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలు గుర్తించేందుకు టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.13.51 కోట్ల విలువైన విత్తనాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ దందాను సూర్యాపేట జిల్లా పోలీసులు చాకచక్యంగా బయటపెట్టారు. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ, గుడిహత్నూరు మండలాల్లో, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ భారీగా నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రైతు ఇచ్చిన సమాచారంతో..: అనుమతి లేకుండా విత్తనాలను తయారుచేసి రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది. ఓ రైతు ద్వారా అందించిన సమాచారంతో అప్రమత్తమైన జిల్లా పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. ద్వారకా సీడ్స్‌ పేరుతో వారు తయారు చేసిన మిర్చి, పలు కూరగాయలు, పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.రూ.13.51 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులను సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ల సమక్షంలో గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన ఓ రైతు నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అదే గ్రామానికి చెందిన రైతు మాడా జగన్మోహన్‌రావు వద్ద ద్వారకా సీడ్స్‌ పేరుతో భారీగా ఉన్న విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పరిశీలించారు. అవి అనుమతి లేనివని గుర్తించి, అతడిని విచారించగా, దీని వెనుక ఉన్న అసలు గుట్టును విప్పాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటున్న ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మాలపాటి వెంకటశివారెడ్డి.. ద్వారకా సీడ్స్‌ పేరుతో విత్తనాలను తయారు చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వనస్థలిపురంలోని గోడౌన్‌లో ఈ నెల 9న ఆకస్మిక తనిఖీలు చేయగా, రూ.13.51 కోట్ల విలువైన ద్వారకా స్టార్‌ బిందు పేరుతో ఉన్న 281.84 కిలోల ప్యాకింగ్‌ మిర్చి విత్తనాలు , 68 కిలోల కాలం ముగిసిన లూజ్‌ మిర్చి విత్తనాలు, ద్వారకా సీడ్స్‌ పేరుతో ఉన్న 45 కిలోల టమాట, 11.75 కిలోల బీరకాయ, ద్వారాకా సౌమ్య, సుప్రియా పేరుతో ఉన్న 479.3 కిలోల పుచ్చకాయ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

విత్తనాలకు రంగులద్ది అమ్మకం..
కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డికి గతంలో విత్తనాల కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2017లో ద్వారకా సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో లైసెన్స్‌ పొందాడని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. విత్తన ప్యాకెట్లపై సరైన లేబుళ్లు ముద్రించలేదని, రైతులకు రశీదులు ఇవ్వకుండా రాత్రి సమయంలో బ్రోకర్ల ద్వారా విక్రయిస్తున్నాడని విచారణలో తేలిందని వివరించారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి నకిలీ విత్తనాలు తెచ్చి రంగులద్ది వివిధ కంపెనీల పేరుతో ప్యాకింగ్‌ చేసి రైతులకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. కాగా, కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న మాలపాటి వెంకటశివారెడ్డి, రీజినల్‌ మేనేజర్‌ వేమిరెడ్డి లక్షిరెడ్డి, వాసిరెడ్డి ప్రతాప్, సూకరి యాదగిరి, మాడా జగన్మోహన్, రమణలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఖమ్మంలో విత్తన దుకాణం సీజ్‌
ఖమ్మంలో లైసెన్స్‌ లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న భాస్కర సీడ్స్‌ దుకాణాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. అందులో విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.26.38 లక్షల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం అడవిరావుల చెర్వులో 18 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం కొత్తపల్లిలో దాదాపు రూ.1,37,780 విలువ చేసే 166 ప్యాకెట్ల (దాదాపు 75 కేజీలు), గద్వాల జిల్లాలో 80 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాలలో వివిధ సీడ్స్‌ దుకాణాల్లో రూ.70వేల విలువ చేసే కాలం చెల్లిన విత్తనాలను పట్టుకున్నారు.

ఆదిలాబాద్‌లో..
అనుమతి లేని రూ.23 లక్షల విలువైన పత్తి విత్తనాలను గురువారం ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో 3, గుడిహత్నూర్‌ మండలంలో 2 దుకాణాల్లో నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలంలో 1.5 లక్షల విలువైన 75 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. కాగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని మాదన్నపేటకు చెందిన బోల్లోని సాంబయ్య ఇంట్లో రూ.3.29 లక్షల విలువైన అనుమతుల్లేని నిమ్మకాయ నాగేశ్వర్‌ పీహెచ్‌ఎస్‌ 491 రకం 524 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

About The Author