భోజనంలో రకాలు తెలుసుకోండి…
భోజనంలో రకాలు
మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.
*సత్వగుణ ప్రధానుల భోజనం*
ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||
ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.
*రజోగుణ ప్రధానుల భోజనం*
కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||
ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.
*తమోగుణ ప్రధానుల భోజనం*
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||
ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.
ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.
ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు “తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు” అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. “నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి” అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.
*మరి మీరేమి తింటారో ఎలా తింటారు మీ ఇష్టం*