శారీరక సుఖం కోసం ఆశపడి 1.29 కోట్లు పోగొట్టుకున్నాడు
శారీరక వాంఛ, అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచాయి. ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ జిల్లా గోండల్ పట్టణానికి చెందిన అశ్విన్ విసారియాకు ఎర్త్ మూవింగ్ మిషిన్లతో పాటు బాగా పొలంకూడా ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో అతడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘‘ మీకు అందమైన హై ప్రోఫైల్ మహిళలతో డేటింగ్, శృంగారం కావాలంటే సంప్రదించండి..’’ అని అందులో ఉంది. అది చదివిన అశ్విన్ ఆసక్తిగా ఉన్నట్లు రిప్లై ఇచ్చాడు. అవతలినుంచి వాట్సాప్ కాల్ చేసిన ఓ నిందితుడు డేటింగ్ క్లబ్‌లో మెంబర్ షిప్ ఫీజుగా రూ. 2,500 చెల్లించమంటే అశ్విన్ చెల్లించాడు. కొద్దిరోజులకు మరింత డబ్బు చెల్లించి అందులో వీఐపీ మెంబర్ అయ్యాడు.అయితే, అతడికి ప్రతిఫలంగా ఏమీ దక్కలేదు. దీంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని నిందితులను అడగటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో నిందితులు డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. మరో కొత్త స్కీము గురించి చెప్పారు. తమ స్కీములో డబ్బులు పెట్టుబడిగా పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మోసగాడి మాటలు నమ్మిన అతడు ఈ సారి భారీ మొత్తాలను పెట్టుబడిపెట్టి మోసపోయాడు. మొత్తంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలువురిపై మోసం, నేర కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.