కృష్ణానది పై కొత్త ఆనకట్ట…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల , ఆర్డీఎస్ కుడి కాల్వలపై తెలంగాణ కేబినెట్ నిరసన వ్యక్తం చేసింది . ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది . ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ఎన్టీటీ , కేంద్రం ఆదేశాలను ఏపీ బేఖాతరు చేసిందని , కేంద్రం వైఖరితో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థి నెలకొందని కేబినెట్ అభిప్రాయపడింది . ఈ నేపథ్యంలో కృష్ణానది పై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . జోగులాంబ గద్వాల – వనపర్తి జిల్లాల మధ్య కృష్ణానదిపై అలంపూర్ వద్ద గుమ్మడం , గొందిమల్ల , వెలటూరు , పెద్దమారూరు గ్రామాల పరిధిలో ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించింది . జోగులాంబ ఆనకట్ట ద్వారా 60-70 టీఎంసీల వరద నీటిని పైప్ లైన్ ద్వారా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది . పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల జలాశయానికి నీటిని ఎత్తిపోసి పాలమూరు , కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది . కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద భీమా వరద కాల్వను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది .