ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ సాధనం యోగా
యోగా- భావితరాలకు అందించవలసిన గొప్ప సంపద
పెనుగొండ సబ్ కలెక్టర్ మధుసూదన్*
పేద, ధనిక బేధం లేకుండా అందరికీ ఆరోగ్యమే ముఖ్యమని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ సాధనం యోగా అని పెనుగొండ సబ్ కలెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సం సందర్భంగా సోమవారం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలోని ఏకశిలా నంది విగ్రహం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెనుగొండ సబ్ కలెక్టర్ మధుసూదన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ యోగా దినోత్సవాన్ని ఆర్కెయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా యోగాసనాలు నిర్వహించాలని తెలియజేయడం జరిగిందని, ఇందులో భాగంగానే లేపాక్షి లో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉండాలన్నారు. భావితరాలకు అందించవలసిన గొప్ప సంపద యోగా అని అభివర్ణించారు. యోగాతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, అమృత ఘడియల్లో సూర్య నమష్కారం చేయగలిగితే శరీరం లోని అన్ని భాగాలూ ఉత్తేజం అవుతాయని అన్నారు. మనో ధైర్యాన్ని కోల్పోయి కరోనాతో ఎంతోమంది మరణించారని, యోగాతో మనో ధైర్యాన్ని సాధించి, దేనినైనా తట్టుకునే శక్తిని పొందవచ్చని తెలిపారు. అనంతరం యోగాసనాలు చేపట్టారు.*
*ఈ కార్యక్రమంలో పురాతత్వ శాఖ ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ సుశాంత్ కుమార్, పురాతత్వ శాఖ జూనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ బాలకృష్ణ రెడ్డి, ఎంటిఎస్ వి.రామప్ప, ఎంటిఎస్ టి సాయి శైలేంద్ర రెడ్డి, లేపాక్షి తహసిల్దార్ బలరాం తదితర అధికారులు పాల్గొన్నారు.
————————————————-
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ..