రాష్ట్రాభివృద్దే వైఎస్ జగన్ లక్ష్యం…

రాష్ట్రాభివృద్దే వైఎస్ జగన్ లక్ష్యం.

చీకటి ఒప్పందాలు బాబు నైజం..

పచ్చపార్టీ నేతల తప్పుడు ప్రచారాలు ప్రజలే అడ్డుకోవాలి..

వైసిపి నేతలు..

వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ టీడీపీ లో ప్రకంపనలు సృష్టించిందని కర్నూల్ జిల్లా వైసిపి నేతలు అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నూల్ పార్లమెంటు అధ్యక్షుడు బి.వై. రామయ్య నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూల్ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోటస్ పాండ్లో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య జరిగిన భేటీలో ఇద్దరి మధ్యా పొత్తుల ప్రస్తావనే రాలేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌-కేటీఆర్‌ భేటీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్నటి (బుధవారం) భేటీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాత్రమే చర్చించారని, పొత్తుల గురించి కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్యాయం చేసుంటే.. ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం టీడీపీ ఎందుకు ప్రయత్నించిందని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం, చిన్న రాష్ట్రాల హక్కుల కోసం వైఎస్‌ జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసారే తప్ప, సీఎం చంద్రబాబు నాయుడులాగా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం అంటూ నానా యాగీ చేసిన చంద్రబాబు దేశమంతటా తిరిగి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలను ప్రత్యేక హోదా కోసం ఒప్పించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు అంటూ చంద్రబాబు తన మంత్రులతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు నిస్సిగ్గుగా కాపురం చేసిన బాబు సాధించిందేమిటో.. ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టి సాధించేదేమిటో చెప్పాలని బి.వై. రామయ్య డిమాండ్‌ చేశారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేడీఆర్ ఇదివరకే ఒడిషా, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ సీఎంలను‌ కలిశారని, ఈ నేపథ్యంలోనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని ఆయన పేర్కొన్నారు. ఇంతదానికే దీనిపై టీడీపీ నేతలు హాహా కారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
చంద్రబాబు స్వార్థం రాష్ట్రానికి శాపం: విభజన నేపథ్యంలో పదేళ్లు హైదరాబాద్‌లో రాజధాని కొనసాగే అవకాశం ఉన్నా ఎందుకు ముందుగానే అక్కడినుంచి పారిపోయి వచ్చారో చంద్రబాబు చెప్పాలని కర్నూల్ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. టీడీపీ నేతల వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని, శాంతిభద్రతలపై నమ్మకం లేకుండా చేశారని టీడీపీ నేతలపై ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతల మాటలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా హఫీజ్ ఖాన్ ఎద్దేవా చేశారు.
చిన్న రాష్ట్రాల హక్కుల కోసమే.. ఎమ్మెల్యే ఐజయ్య.: ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్‌ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ : కాటసాని
తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డిని, కేటీఆర్‌ కలిస్తే తప్పేంటని వైఎస్సాఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాం భూపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌తో జతకడుతున్నామని తెలిపారు. సినిమాల కోసం బాలకృష్ట, పవన్‌ కళ్యాణ్‌లు కేసీఆర్‌ను కలిస్తే తప్పు లేనప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్‌, కేటీఆర్‌ను కలిస్తే మాత్రం తప్పేలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టెర్నెకల్ సురేంధర్ రెడ్డి, హనుమంత రెడ్డి, ఆదిమొహన్ రెడ్డి, గోపాల్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరుణాకర్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, కొంతలపాడు శ్రీనివాస్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పెరుగు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాలగొన్నారు.

About The Author