చివరి శ్వాస ఉన్నంత వరకూ టీఆర్‌ఎస్‌తోనే: దానం
‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్‌ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు.డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌లో కంటే టీఆర్‌ఎస్‌లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందునే ఆత్మ పరిశీలనతో టీఆర్‌ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.