ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్ఐ యాకన్న ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాంగ్రెస్ ఉత్సాహం.. సిటీలో ట్రాఫిక్ నరకం
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో బుధవారం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో హడావుడిగా మధ్యాహ్నం వీటిని జారీ చేశారు. అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానుల వాహనాలతో గాంధీభవన్ రోడ్డు నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల మార్గాల్లో ప్రయాణించిన నగర జీవి నరకం చవిచూశాడు.
ట్రాఫిక్ మళ్లింపులపై ముందురోజే ఆంక్షలు విధించడం ఆనవాయితీ. అయితే ఎందుకో ఈ సారి విస్మరించారు. బుధవారం మధ్యాçహ్నానికే అబిడ్స్, కోఠి, నాంపల్లిలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. అప్పుడు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు గాంధీభవన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు అంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.