భూముల ధరలకు రెక్కలు.. ఎకరా కనిష్ట ధర రూ.75 వేలు


మూడు రకాల భూములు, ఆస్తులకు ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ధరలు పెంచాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ కేటగిరీల వారీగా ధరలను నిర్ధారించింది.
రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఇటు మధ్య తరగతి ప్రజానీకానికి భారం పడకుండా ప్రభుత్వ విలువలను సవరించామని అధికారులు చెబుతున్నారు.
ఖాళీ స్థలాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ అప్‌లోడ్‌ చేస్తుండగా, వ్యవసాయ భూముల వివరాలను ధరణి పోర్టల్‌ సాంకేతిక బృందం అప్‌లోడ్‌ చేయనుంది.
ప్రస్తుతం ఉన్న6 శాతం నుంచి 7.5 శాతానికి పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఫీజు
రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్లకు ప్రభుత్వ ధరల సవరణ ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ భూమి కనిష్ట ధర ఎకరం రూ.75 వేలుగా నిర్ధారించారు. సవరించిన ధరలు ఈనెల 20వ తేదీ నుంచి లేదా ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు (జనాభా ప్రాతిపదికన), కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ -1, హెచ్‌ఎండీఏ-2, జీహెచ్‌ఎంసీలను యూనిట్‌గా తీసుకుని రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ధరలను ఖరారు చేసింది. వ్యవసాయ భూములను ఐదు కేటగిరీలుగా విభజించింది. వ్యవసాయ భూముల విషయంలో వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీటీడీఏ)ని గ్రామీణ ప్రాంతాల్లో కలపగా, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా), యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వైటీడీఏ)ల పరిధిలో ప్రత్యేక ధరలను నిర్ణయించింది.
మూడు రకాలు.. పలు శ్లాబులు
వ్యవసాయ భూముల విషయానికి వస్తే ప్రస్తుతం ఎకరాకు కనిష్టంగా రూ.10 వేలు ఉన్న బుక్‌ వాల్యూను రూ.75 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇదే కనిష్ట ధరగా నిర్ధారణ కానుంది. ఆ తర్వాత శ్లాబులను 30, 40, 50 శాతంగా పెంచారు. ఫ్లాట్లు/అపార్ట్‌మెంట్ల విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకున్నారు. లక్షలోపు, లక్షకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలతో పాటు గ్రామీణ ప్రాంతాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. లక్షలోపు జనాభా ఉన్న పంచాయతీలకు కనిష్ట ధర చదరపు అడుగుకు రూ.1,000గా ప్రతిపాదించారు.

ఖాళీ స్థలాల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో కనిష్ట ధర చదరపు గజానికి రూ.200, మండల కేంద్రాలు, 50 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.300, 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రూ.400, వీటీడీఏ మినహా ఇతర పురపాలికలు, కార్పొరేషన్లలో రూ.500, హెచ్‌ఎండీఏ -1లో రూ.1,500 హెచ్‌ఎండీఏ-2లో రూ.800, జీహెచ్‌ఎంసీలో రూ.3 వేలుగా కనిష్ట ధరను నిర్ధారించారు. అన్ని రకాల ప్రాంతాల్లోనూ గరిష్ట ధరను 3- 4 శ్లాబులుగా విభజించారు. ఈ విభజన మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ (కమర్షియల్‌)లో అత్యధికంగా ప్రస్తుతం గజం రూ.65 వేలుగా ఉన్న గరిష్ట ధర పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత రూ.74,500 (30 శాతం) కానుంది. రాష్ట్రంలో చదరపు గజానికి ఇదే అత్యధిక ప్రభుత్వ ధర కానుండడం గమనార్హం.

సవరణ కమిటీల ఆమోదం
భూముల విలువల సవరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విలువల సవరణ కమిటీలు శనివారం సమావేశమయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, సబ్‌ రిజిస్ట్రార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో తహసీల్దార్లు హాజరయ్యారు. ఆయా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లోని భూముల సవరణ ప్రతిపాదనలు కమిటీలు పరిశీలించి వాటికి ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎప్పుడైనా సవరించిన విలువలను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రిజిస్ట్రేషన్ల శాఖ చెపుతుండగా, ఈనెల 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఒకవేళ వాయిదా పడితే ఆగస్టు 1 నుంచి సవరించిన విలువలు అమల్లోకి రావడం ఖాయమని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.

రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు ఖాయం!
భూముల విలువల సవరణతో పాటు ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు కూడా ఖాయమేనని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ఇందుకు అంగీకరించారని, ప్రస్తుతమున్న 6 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును 7.5 శాతానికి పెంచుతూ నేడో, రేపో ఉత్తర్వులు వస్తాయని సమాచారం.

About The Author