పోలీసు తల్లీ .. దయగల తల్లి ..

పోలీసు తల్లీ .. దయగల తల్లి ..

మహిళా పోలీసు కానిస్టేబుల్‌ తల్లి మనసు అందరి ప్రశంసలను అందుకుంటోంది. రోడ్డు పక్కను విసరివేసిన నవజాత శిశువుకి ఆమె స్తన్యమిచ్చి ఆదుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు యలహంక జీకేవీకే క్యాంపస్‌ రోడ్డు పక్కలో నవజాత ఆడశిశువును వదిలివెళ్లారు. విపరీతమైన చలికి బిడ్డ గుక్కపట్టి ఏడుస్తోంది. చీమలు పట్టిన్న నవజాత శిశువును చూసిన కొందరు స్థానికులు విద్యారణ్యపురం పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డ లభించిన స్థలం తమ పరిధి కాదని విద్యారణ్యపుర పోలీసులు రాలేదు. దీంతో యలహంక పోలీసులు వెళ్లారు.
చలించిన సంగీత
వారిలోని మహిళా కానిస్టేబుల్‌ సంగీతా ఎస్‌ హలిమనికి ఆ బిడ్డను చూడగానే తల్లి మనసు తల్లడిల్లింది. పసిగుడ్డుకు రొమ్ము ఇచ్చి ఆకలి తీర్చారు. బిడ్డకు బట్టలు తొడిగి యలహంక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ నుంచి వాణి విలాస్‌ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యంగా ఉన్న బిడ్డను పిల్లల సంక్షేమ శాఖకు అప్పగించేందుకు వైద్యులు నిర్ధారించారు. సంగీత చేసిన మంచిపనికి డీసీపీ కళా కృష్ణస్వామితో పాటు పలువురు సీనియర్‌ అధికారులు అభినందించారు. సకాలంలో పాలు త్రాగించి బిడ్డను కాపాడిన సంగీతను ఆసుపత్రి సిబ్బంది ప్రశంసించారు. సంగీతకు 10 నెలల ఆడకూతురు ఉంది. ఆమె గొప్పమనసుపై సోషల్‌ మీడియాలో కూడా మన్ననలు అందుకుంటోంది.

About The Author