పిల్లులను ఎలా చంపాలి.. అని ఇంటర్‌నెట్‌లో వెతికి మరీ..


పెంపుడు పిల్లులను హతమారుస్తూ నరరూప రాక్షసుడిలా ప్రవర్తించిన ఓ వ్యక్తికి స్థానిక కోర్టు శిక్ష విధించింది. ఐదేళ్ల… మూడు నెలల కాలం పాటు జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. వివరాలు… స్టీవ్‌ బొకే(54) అనే వ్యక్తి గతంలో నేవీలో పనిచేసేవాడు. అనంతరం సెక్యూరిటీ గార్డుగా కొన్నాళ్లపాటు జీవితం గడిపాడు. ఈ క్రమంలో ఏడాది వ్యవధిలో(2018- 19) బ్రిగ్టన్‌ పట్టణంలో దాదాపు తొమ్మిది పిల్లులను హత్య చేయడమే గాకుండా, మరో ఏడింటిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే, చాలా రోజులపాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరిగిన బొకేను ఎట్టకేలకు ఓ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు. కత్తితో ఓ పిల్లిని కసితీరా పొడిచిన దృశ్యాల ఆధారంగా, సదరు ఇల్లు గల యజమాని బొకేను గుర్తించి, సమాచారం ఇవ్వడంతో.. ఈ క్యాట్‌ కిల్లర్‌ను పట్టుకున్నారు. విచారణలో భాగంగా అతడి లాప్‌టాప్‌ను పరిశీలించగా.. పిల్లులను ఎలా చంపాలన్న అంశం గురించి అతడు నెట్‌లో సర్చ్‌ చేసినట్లు గుర్తించారు. అయితే, ఇన్ని ఆధారాలు దొరికినప్పటికీ తాను అమాయకుడినని నమ్మించేందుకు బొకే విశ్వప్రయత్నాలు చేశాడు. ఆఖరికి అతడి ఫోన్‌లో ఓ పిల్లిని చంపుతున్న ఫొటో లభ్యమవడం, అతడి ఇంట్లో పిల్లి రక్తంతో నిండిన కత్తి దొరకడంతో పోలీసులు బొకేను నిందితుడిగా తేల్చారు.

ఈ క్రమంలో శుక్రవారం కేసు విచారణకు రాగా.. సదరన్‌ ఇంగ్లండ్‌లోని హెవ్‌ క్రౌన్‌ కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జడ్జి జెరెమీ గోల్డ్‌ మాట్లాడుతూ… ‘‘ఇది నిజంగా క్రూరమైన చర్య. అతడు నేరానికి పాల్పడ్డట్లు రుజువైంది’’ అని పేర్కొంటూ జైలు శిక్ష ఖరారు చేశారు. ఇక విచారణ జరుగుతున్న సమయంలో… బొకే కారణంగా పెంపుడు పిల్లులను పోగొట్టుకున్న యజమానులు… ‘‘మా గుమ్మాల ముందు కత్తిపోట్లతో రక్తమోడుతున్న పిల్లులను చూసినప్పుడు పడిన బాధ వర్ణనాతీతం. అతడికి ఎట్టకేలకు పడటం సంతోషకరం’’ అని పేర్కొన్నారు. అయితే, తాను అత్యంత క్రూరంగా పిల్లులను హత్య చేయడానికి గల కారణాలను మాత్రం బొకే వెల్లడించకపోడం గమనార్హం.

About The Author