హష్ ఆయిల్.. 1 ఎంఎల్ @ రూ.600
గంజాయి సంబంధిత ఉత్పత్తి అయిన హష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు యువకులకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. వీరి నుంచి 100 మిల్లీ లీటర్ల (ఎంఎల్) హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుడిమల్కాపూర్‌లోని ప్రియ కాలనీకి చెందిన వడ్డల లక్ష్మీ వెంకట నర్సింహాచారి డీజే సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించడం కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి గుంటూరుకు చెందిన ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే హష్ ఆయిల్‌కు గంజాయి కంటే ఎక్కువ డిమాండ్ ఉందంటూ ఇతగాడు చెప్పాడు.
అంగీకరించడంతో ఇటీవల 100 ఎంఎల్ ఆయిల్ తెచ్చి ఇచ్చాడు. దీన్ని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సాయంతో 5 ఎంఎల్ చొప్పున చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేస్తున్న చారి హీట్ గన్‌తో సీలు వేస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన ప్రైవేట్ ఉద్యోగి ముల్కాల భాను ప్రకాష్ సాయంతో విక్రయిస్తున్నాడు. ఒక్కో బాక్సును రూ.3 వేలకు (ఒక్కో మిల్లీ లీటర్ రూ.600 చొప్పున) అమ్ముతూ వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటున్నారు. వీరి వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీ, టి.శ్రీధర్ రంగంలోకి దిగి వల పన్నారు. ఆదివారం చారి, భానులను పట్టుకుని హష్ ఆయిల్, వేయింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కితే ఈ ఆయిల్ మూలాలపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.